దోహా: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్ ఫైనల్ టోర్నీలో భారత షూటర్ల పతక వేట మొదలైంది. శనివారం మొదలైన సీజన్ చివరి టోర్నీలో యువ షూటర్లు సురుచి సింగ్ స్వర్ణ పతకంతో మెరువగా, సైనియమ్ రజతం ఖాతాలో వేసుకుంది. మొదటి రోజు తొలుత 10మీ రైఫిల్ ఈవెంట్లలో భారత షూటర్లకు నిరాశ ఎదురు కాగా, సురుచి అద్భుత ప్రదర్శనతో పసిడి దక్కించుకుంది.
మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. గత సెప్టెంబర్-అక్టోబర్లో జరిగిన నాలుగు వేర్వేరు వరల్డ్కప్ టోర్నీల్లో స్వర్ణాలు సాధించిన సురుచి మరోమారు తన గురికి తిరుగులేదని చాటిచెప్పింది. ఇదే విభాగంలో సైనియమ్ 243.3 స్కోరుతో రజతం సొంతం చేసుకోగా, డబుల్ ఒలింపియన్ మను భాకర్(179.2) ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సురుచి, సైనియమ్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.