న్యూఢిల్లీ: భారత అథ్లెట్, రేస్ వాకర్ భావ్నా జాట్(Bhawna Jat)పై.. 16 నెలల బ్యాన్ విధించారు. యాంటీ డోపింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. గత ఏడాది ఆగస్టులో ఆమె నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో భావ్నా.. మాజీ జాతీయ చాంపియన్. రికార్డు హోల్డర్ కూడా. గత ఏడాది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమెపై సస్పెన్షన్ విధించింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మధ్యలోనే బుదాపెస్ట్ నుంచి ఆమెను వెనక్కి రప్పించారు. గత ఏడాది ఆగస్టు 10వ తేదీ నుంచి 16 నెలల బ్యాన్ అమలులోకి వస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీన ఆమెపై విధించిన నిషేధం ముగుస్తుంది. నాడా రూల్స్‌లోని ఆర్టికల్ 2.4 ప్రకారం వాకర్ భావ్నా జాట్‌పై నిషేధం విధించారు. జూలై 10వ తేదీన ఆ తీర్పును ఇచ్చారు. కానీ ఆ వార్తలను యాంటీ డోపింగ్ ఏజెన్సీ గురువారమే తన వెబ్సైట్లో ప్రచురించింది. ఆర్టికల్ 2.4 ప్రకారం.. ఓ అథ్లెట్ వరుసగా మూడు సార్లు డోపింగ్ పరీక్షలో విఫలం అయితే, ఆ క్రీడాకారులపై నిషేధం విధిస్తారు. 2023లో మే, జూన్ నెలలో జరిగిన డోపింగ్ పరీక్షల్లో భావ్నా పాజిటివ్‌గా తేలింది. నిర్దేశిత సమయంలో ఫైలింగ్ కూడా చేయలేదని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భావ్నా జాట్ ప్రాతినిధ్యం వహించింది. గతేడాది జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర పోటీల్లో ఆమె స్వర్ణం గెలుచుకున్నది.