హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోరాట్ వేదికగా జరిగిన థాయ్‌లాండ్ పారా సైక్లింగ్ కప్ 2025లో భారత ప్లేయర్లు సత్తాచాటారు. భారత్ సహా మలేషియా, థాయ్‌లాండ్, యూఏఈ, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్థాన్, చైనా, తజకిస్థాన్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్ దేశాల నుంచి పారా సైక్లిస్టులు టోర్నీలో పోటీపడ్డారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన పది మందితో కూడిన భారత పారా సైక్లింగ్ బృందం పతకాలతో ఆకట్టుకుంది.
కిలోమీటర్ వ్యక్తిగత ట్రయల్స్‌లో విశ్వకు కాంస్యం, లిషా రజతం సాధించారు. వ్యక్తిగత విభాగంలో అదే దూకుడు కొనసాగిస్తూ విశ్వ, లిష కాంస్యాలు కైవసం చేసుకున్నారు. రోడ్ ఈవెంట్ వ్యక్తిగత టైమ్ ట్రయల్స్‌లో విశ్వ, లిషా, యోగేశ్, ప్రశాంత్ కాంస్యాలు సొంతం చేసుకున్నారు. మొత్తంగా టోర్నీలో రెండు రజతాలు సహా తొమ్మిది కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. మన పారా సైక్లిస్టులు అసాధారణ ప్రదర్శన కనబరిచారని ఆదిత్య మెహతా అభినందించారు.