బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ అండ్ ఉబర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. థామస్ కప్‌లో భారత పురుషుల బృందం 5-0తో జర్మనీని చిత్తు చేయగా.. ఉబర్ కప్‌లో మహిళల జట్టు 4-1తో కెనడా బృందంపై విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఆదివారం ప్రారంభమైన టోర్నీలో మన స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ దూకుడు కనబర్చారు. ఉబర్ కప్ గ్రూప్-డి సింగిల్స్‌లో సింధు 21-17, 21-10తో మిచెల్లీ లీను చిత్తు చేసింది. మిగతా సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 17-21, 21-18, 21-17తో వెన్ యు ఝాంగ్‌పై నెగ్గగా.. అష్మిత చాలిహా 12-21, 21-11, 22-20తో రేచల్ చాన్‌పై గెలిచింది. మహిళల డబుల్స్‌లో త్రిషా జాలీ-తానీషా క్రాస్టో గెలుపొందగా.. శ్రుతి మిశ్రా-సిమ్రన్ సింఘి జోడీ నిరాశపర్చింది. థామస్ కప్ గ్రూప్ ‘సి’ సింగిల్స్‌లో మన షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రణయ్‌తో పాటు డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి, అర్జున్-ధ్రువ్ కపిల్ విజయాలు సాధించారు. జర్మనీపై ఏకపక్ష విజయంతో తిరుగులేదని నిరూపించారు. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ 21-16, 21-13తో మ్యాక్స్ వైస్కిర్చన్పై నెగ్గాడు. మిగతా పోరుల్లో శ్రీకాంత్ 18-21, 21-9, 21-11తో కై షాఫర్ను చిత్తు చేయగా.. హెచ్ఎస్ ప్రణయ్ 21-9, 21-9 మాథ్యూ కిక్లిట్జ్పై అలవోకగా గెలిచాడు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి, అర్జున్-ధ్రువ్ కపిల్ జోడీలు విజయంతో సాధించాయి.