బెల్జియం: ఎఫ్ఐహెచ్ యూరోపియన్ అంచెలో భారత హాకీ జట్టు అపజయాల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం భారత జట్టు.. 2-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మాజీ సారథి మన్‌ప్రీత్ సింగ్ తన కెరీర్లో 400వ మ్యాచ్ ఆడినా అతడికి ఆ ఆనందం కూడా మిగల్లేదు. మ్యాచ్‌లో మూడో నిమిషంలోనే సంజయ్ తొలి గోల్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ బ్రాండ్ (4వ ని.), బ్లేక్ గోవర్స్ (5వ ని.) రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి ఆధిపత్యాన్ని కొనసాగించారు.
అదే ఊపులో కూపర్ బర్న్స్ (18వ ని.) మరో గోల్ కొట్టడంతో ఆ జట్టు 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట 27వ నిమిషంలో వరుసగా రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత్ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. కానీ 36వ నిమిషంలో దిల్‌ప్రీత్ గోల్ కొట్టి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. అయితే ఆ తర్వాత భారత్.. గోల్ కొట్టకపోవడంతో ఓటమి తప్పలేదు.
ఈనెల 21న భారత్.. బెల్జియంతో తలపడనుంది. మహిళల హాకీ జట్టు సైతం వరుస పరాభావాలతో సతమతమవుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 1-2తో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడింది. మూడు రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.