Paris Olympics | ఒలింపిక్స్‌లో భారత హాకీది మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలతో భారత జైత్రయాత్ర అప్రతిహాతంగా సాగింది. విశ్వక్రీడల్లో భారత్ మొత్తం పది స్వర్ణాలు గెలిస్తే అందులో హాకీకి వచ్చినవే 8. అదీగాక మనకు తొలి పతకం దక్కిందే ఈ క్రీడలో.. 1928 అమెస్టర్‌డామ్ ఒలింపిక్స్ నుంచి 1956 (మెల్బోర్న్) దాకా ‘మెన్ ఇన్ బ్లూ’ను ఓడించిన జట్టే లేదు. భారత్‌కు ఒలింపిక్స్‌లో 35 పతకాలు రాగా అందులో హాకీ వాటానే 12 అంటే ఈ క్రీడలో మన ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హాకీలో 1980 తర్వాత 41 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2020 టోక్యోలో భారత జట్టు కాంస్యం నెగ్గింది. ‘పారిస్’లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తూ పతకం రంగు మార్చి హాకీకి పునర్వైభవం తేవాలని అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఆ అంచనాలను అందుకోగలదా..?
నాలుగేండ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌లో 1928 నుంచి 1960 దాకా ఒలింపిక్స్‌లో ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌నూ (30-0) మనం ఓడిపోలేదు. దేశ హాకీ చరిత్రలో ఈ కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. ఇక 1928, 1956 ఒలింపిక్స్‌లో అయితే భారత జట్టు ప్రత్యర్థులను ఒక్క గోల్ కూడా కొట్టనీయకుండా నిలువరించింది. జైపాల్ సింగ్ ముండా, లాల్ షేక్ బొఖారి, ధ్యాన్‌చంద్, కిషన్ లాల్, కేడీ సింగ్, బల్బీర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ సారథ్యంలో మన హాకీ జట్టు పసిడి పతకాల దండయాత్ర సాగించింది. 1960 తర్వాత మన ఆధిపత్యం కాస్త తగ్గినా మళ్లీ 1968 నుంచి 1980 దాకా వరుసగా పతకాల బాట పట్టింది. కానీ ఆ తర్వాత ఈ క్రీడలో మనకు పతకం దక్కడానికి నాలుగు దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది.
గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి ‘పారిస్’ కోటా దక్కించుకున్న భారత జట్టు ప్రయాణం గత ఏడాదిన్నర కాలంగా ఒడిదొడుకుల మధ్యే సాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భువనేశ్వర్, రూర్కెలా వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత్.. స్పెయిన్, అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ను ఓడించినా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఏప్రిల్‌లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్ గెలవలేదు. మే లో ముగిసిన ప్రో లీగ్ లోనూ మన ప్రదర్శన అంతంతమాత్రమే. అయితే జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లతో చేసిన ప్రయోగాలతో ఫలితాలు తమకు అనుకూలంగా రాలేదని, పారిస్‌కు కోర్ టీమ్‌ను తయారుచేయడానికి ఈ ఫలితాలు తమకు ఎంతో ఉపయుక్తమయ్యాయని భారత చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ అభిప్రాయపడుతున్నాడు. అతడి మార్గనిర్దేశకత్వంలో మన జట్టు ఆటతీరులోనూ మార్పు వచ్చింది. పటిష్టమైన డిఫెన్స్‌తో పాటు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పైకి దూకుడుగా దాడి చేయడంలో మన కుర్రాళ్లు రాటుదేలారు.
తమ సుదీర్ఘ కెరీర్లో నాలుగో ఒలింపిక్స్ ఆడనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్ వంటి వెటరన్ల అండగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో సుఖ్జీత్ సింగ్, సంజయ్ అభిషేక్, రాజ్‌కుమార్, జర్మన్‌ప్రీత్ వంటి కుర్రాళ్ల కలయికతో జట్టు సమతూకంగా ఉంది. టోక్యోలో కాంస్యం గెలిచిన బృందంలోని 11 మంది ప్రస్తుతం జట్టులో ఉన్నారు. హార్దిక్ సింగ్, వివేక్ సాగర్, మన్దీప్ సింగ్ వంటి మిడ్ ఫీల్డర్లు, శ్రీజేష్ వంటి ఆటగాళ్లు భారత్‌కు కీలకం. ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవనున్న శ్రీజేష్‌తో పాటు మరికొందరు సీనియర్లకు ఇదే చివరి అవకాశం.
గ్రూప్-బీ లో ఉన్న భారత్ లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లు ఆడనుండగా నాకౌట్ స్టేజ్‌కు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. తన తొలి మూడు మ్యాచ్‌లను న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉండగా చివరి రెండు మ్యాచ్‌లలో తన కంటే మెరుగైన ర్యాంకు కలిగిన ఆస్ట్రేలియా, బెల్జియంతో తలపడనుంది. మొదటి మూడు మ్యాచ్‌లలో గెలిస్తే భారత్ నాకౌట్ దశకు చేరుకున్నట్టే.