న్యూఢిల్లీ: భారత్ ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ ఫుట్‌బాలర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న హబీబ్ సోమవారం తనువు చాలించారు. భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన 74 ఏండ్ల హబీబ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు. బ్యాంకాక్ వేదికగా 1970లో జరిగిన ఆసియాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టులో హబీబ్ సభ్యుడు. హైదరాబాద్‌కే చెందిన సయ్యద్ నయిముద్దీన్ కెప్టెన్సీలో హబీబ్ కండ్లు చెదిరే ఆటతీరుతో జట్టుకు పతకాన్ని అందించారు.
జెర్సీ నంబర్ 10లో ఈ హైదరాబాద్ దిగ్గజ ప్లేయర్ లెక్కకు మిక్కిలి ప్రదర్శనలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌కు ఎందరో మేలిమి ముత్యాలను అందించిన హైదరాబాద్ దిగ్గజ ప్లేయర్లలో హబీబ్ ముందువరుసలో ఉంటారు. దేశ ఫుట్‌బాల్‌కు దిక్సూచిగా నిలిచిన బెంగాల్లోనూ హబీబ్..ప్రముఖ క్లబ్‌లుగా పేరొందిన మోహన్‌బగాన్, ఈస్ట్బెంగాళ్, మహమ్మదీన్కు ప్రాతినిధ్యం వహించారు. 1977లో బ్రెజిల్ దిగ్గజం పీలే సారథ్యం వహించిన కాస్మోస్ క్లబ్, మోహన్బగాన్తో జరిగిన మ్యాచ్‌లో హబీబ్ ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హబీబ్‌ను పీలే ప్రత్యేకంగా అభినందించారు.