బర్మింగ్‌హామ్: టీమిండియా క్రికెటర్లు(Indian cricketers) బస చేస్తున్న హోటల్ సమీపంలో అనుమానాస్పద ప్యాకెట్ దొరకడంతో అక్కడ పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆ సమయంలో క్రికెటర్లు ఎవరూ హోటల్ గదుల నుంచి బయటకు వెళ్లరాదు అని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్లేయర్లు హోటల్‌కే పరిమితం అయ్యారు. బర్మింగ్‌హామ్‌లోని సెంటనరీ స్క్వేర్ వద్ద అనుమానాస్పద ప్యాకెట్‌ను గుర్తించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సమీప బిల్డింగ్‌ల్లో ఉన్న నివాసితులను చెక్ చేశారు. టీమిండియా క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌ను కూడా సీజ్ చేశారు. బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్ పోలీసులు ఇచ్చిన సోషల్ మీడియా పోస్టు ఆధారంగా క్రికెటర్లకు హెచ్చరిక జారీ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఎడ్జ్‌బస్టన్‌లో గిల్‌తో పాటు కొందరు ఆటగాళ్లు ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. మరో పది మంది సభ్యులు మాత్రం దూరంగా ఉన్నారు. సెంటనరీ స్క్వేర్ వద్ద కార్డెన్ సెర్చ్ జరుగుతోందని, అనుమానాస్పద ప్యాకేజీపై దర్యాప్తు చేపట్టినట్లు బర్మింగ్‌హామ్ పోలీసులు ఓ పోస్టు చేశారు. మధ్యామ్నం మూడు గంటలకు తమకు అలర్ట్ ఇచ్చారని, దాంతో అక్కడ ఉన్న బిల్డింగ్‌లను ఖాళీ చేయించినట్లు ఓ మెసేజ్‌లో తెలిపారు. గంట పాటు జరిగిన కార్డన్ సెర్చ్ తర్వాత సీజ్ ఎత్తివేశారు.