చెన్నై: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈనెల 19 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు తెరలేవనుంది. ఇందుకోసం సోమవారం టీమ్ఇండియా క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. తొలుత యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ..బుమ్రా, అశ్విన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ వీరిని అనుసరించారు. జడేజా, పంత్, సిరాజ్‌కు లోకల్ బౌలర్లు బౌలింగ్ చేశారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న బంగ్లా జట్టును భారత్ సీరియస్‌గా తీసుకుంటున్నది. కొత్తగా ఎర్రమట్టితో తయారుచేసిన పిచ్‌పై ప్రత్యర్థికి సవాల్ విసరనుంది. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్న ర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే టీమ్ఇండియా క్రికెటర్లు గ్రూపులుగా విడిపోయి దిలీప్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. పాక్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న బంగ్లా..భారత్‌కు పోటీనివ్వాలని చూస్తున్నది. బంగ్లా క్రికెటర్లు సోమవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.