ముంబై: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో చైనా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనడం ఖాయమైంది. అదే సమయంలో స్వదేశంలో ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మొదట టీమ్ఇండియా ఈ టోర్నీ పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నా.. శుక్రవారం భేటీ అయిన బీసీసీఐ అపెక్స్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని ప్రధాన జట్టు వన్డే వరల్డ్‌కప్ ఆడుతున్న సమయంలోనే.. ద్వితీయ శ్రేణి జట్టు ఏషియన్ గేమ్స్ బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌నకు ఎంపిక కాని ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కనుంది. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో మూడు సార్లు మాత్రమే క్రికెట్‌ను భాగం చేశారు. చివరిసారి 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత జట్టు పాల్గొనలేదు. ఐపీఎల్లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది.