హార్సెన్స్ (డెన్మార్క్): థామస్ కప్‌లో 2022 విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో సెమీస్ బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన కీలక పోరులో భారత్.. 0-3తో ఫ్రాన్స్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. 1952, 1955, 1979 తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు ఇది నాలుగో కాంస్యం. లక్ష్యసేన్ గైర్హాజరీలో తొలి సింగిల్స్ ఆడిన యువ షట్లర్ ఆయుష్.. 11-21, 9-21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రిస్టొ పొపొవ్ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్.. 16-21, 18-21తో ఫ్రాన్స్ యువ సంచలనం అలెక్స్ లేనియర్ జోరుకు తలవంచాడు. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్‌లో టొమ పొపొవ్.. 21-19, 21-16 తో ప్రణయ్‌ను ఓడించి ఫ్రాన్స్‌ను తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు.