కోబ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు దేశానికి పసిడి పతకాల పంట పండిస్తున్నారు. కోబ్ (జపాన్) వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మంగళవారం భారత్‌కు మూడు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం దక్కాయి. భారత్‌కు హైజంప్, జావెలిన్ త్రో, క్లబ్ త్రో ఈవెంట్స్‌లో పతకాలు లభించాయి. పురుషుల హైజంప్ టీ63 కేటగిరీలో తంగవేలు మరియప్ప.. 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు.
యూఎస్ఏ అథ్లెట్లు ఎజ్రా ఫ్రెచ్ (1.85 మీటర్లు), సామ్ గ్రీవ్ (1.82 మీటర్లు) వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంటిల్.. బరిసెను 68.17 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. దులన్ కొడితువక్కు (శ్రీలంక) రజతం నెగ్గగా భారత్‌కే చెందిన సందీప్ (60.41 మీటర్లు) కాంస్యం సాధించాడు. మహిళల క్లబ్ త్రో ఎఫ్51లో ఏక్తా బైయాన్.. 20.12 మీటర్ల త్రో తో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా 14.56 మీటర్లతో కాశిశ్ లక్రా రజతం గెలుచుకుంది. ఈ టోర్నీలో సోమవారం తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే.