ODI World Cup | ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి 156 పరుగులు జోడించారు.. తర్వాత బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 19.3 ఓవర్లు (117 బంతులు) మిగిలి ఉండగానే భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సరిగ్గా విన్నింగ్ షాట్‌తోనే శ్రేయాస్ అయ్యర్ (53) తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం ఆసక్తికర పరిణామం.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను 42.5 ఓవర్లకే పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్. తిరిగి 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. మూడు ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదిన శుభ్‌మన్ గిల్.. మూడో ఓవర్లో షాహిన్ షా ఆఫ్రిది వేసిన బంతిని మరోసారి బౌండరీకి మళ్లించబోయి షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.
ఫస్ట్ డౌన్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు జత కలిశాడు. హసన్ అలీ వేసిన పదవ ఓవర్లో ఐదో బంతిని మిడ్ ఆన్ మీదుగా కొట్టడంతో మహ్మద్ నవాజ్ క్యాచ్ పట్టాడు. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. కానీ, 21వ ఓవర్ లో షాహిన్ షా అఫ్రిది వేసిన నాలుగో బంతిని మిడ్ వికెట్ మీదుగా పంపడంతో నేరుగా ఇఫ్లికార్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.