ఐసీసీ ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌పై ఘనమైన రికార్డు కలిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. దాయాదుల పోరులో మరోసారి పైచేయి సాధించింది. యూఏఈలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌ను ఓటమితో మొదలుపెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. పాక్‌పై మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి ఈ టోర్నీలో బోణీ కొట్టింది. మొదట బౌలింగ్‌లో హైదరాబాదీ అరుంధతిరెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్ కట్టుదిట్టమైన పేస్‌కు పాక్ బెంబేలెత్తగా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఆ జట్టుపై మరింత ఒత్తిడి పెంచింది. స్వల్ప ఛేదనే అయినా భారత్‌కు విజయం అంత ఈజీగా దక్కలేదు. షఫాలీ, జెమీమా, మంధాన, హర్మన్, రిచా వంటి స్టార్ బ్యాటర్లున్నా టీమ్ఇండియా ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లే నమోదవడం గమనార్హం.
T20 World Cup | దుబాయ్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ గెలుపు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా.. ఆదివారం పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దుబాయ్ వేదికగా దాయాదితో జరిగిన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. మొదట పాకిస్థాన్‌ను నిర్ణీత ఓవర్లలో 105/8 పరుగులకే కట్టడి చేసింది.
అరుంధతిరెడ్డి (3/19), స్పిన్నర్ శ్రేయాంక పాటిల్(2/12) పాక్‌ను నిలువరించారు. పాక్ జట్టులో నిదా దర్ (34 బంతుల్లో 28, 1 ఫోర్) ఫర్వాలేదనిపించింది. స్వల్ప ఛేదనే అయినప్పటికీ భారత్ దానిని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (35 బంతుల్లో 32, 3 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా ఆడగా హర్మన్‌ప్రీత్ (24 బంతుల్లో 29 రిటైర్డ్ హర్ట్, 1 ఫోర్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. అరుంధతికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆరంభం నుంచే తడబాటు..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రేణుకా సింగ్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి ఫెరోజా ఖాతా తెరవకుండానే క్లీన్‌బౌల్డ్ అయింది. వన్ డౌన్లో వచ్చిన సిద్రా అమిన్ (8) దీప్తి శర్మ 5వ ఓవర్లో బౌల్డ్ అయి వెనుదిరిగింది. అరుంధతి ఏడో ఓవర్లో ఒమైమ సోహైల్ (3)ను ఔట్ చేయడంతో పాక్ కష్టాలు రెట్టింపయ్యాయి.
శ్రేయాంక పాటిల్ వేసిన పదో ఓవర్లో మునీబా అలీ (17) స్టంపౌట్ అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తొలి పది ఓవర్లలో ఏకంగా 38 డాట్ బాల్స్ నమోదవడం విశేషం. 13వ ఓవర్లో అలియా రియాజ్ (4) కూడా అరుంధతి బౌలింగ్‌లోనే ఎల్బీగా ఔట్ అయి డగౌట్ చేరింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నిదాను బౌల్డ్ చేసిన అరుంధతి మూడో వికెట్‌ను సాధించింది.
భారత్ కూడా నెమ్మదిగానే..
స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ భారత్ వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న దుబాయ్ పిచ్‌పై పాక్ తొలి ఓవర్ నుంచే స్పిన్నర్లను దించి భారత్ దూకుడుకు అడ్డుకట్ట వేసింది. 16 బంతులాడిన ఓపెనర్ స్మృతి మంధాన (7) ఐదో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే షఫాలీ కూడా డిఫెన్స్‌తో పాటు సింగిల్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో ఓవర్‌కు 5 రన్‌రేట్ కూడా నమోదుకాలేదు.
8వ ఓవర్ దాకా భారత్ ఖాతాలో ఒక్క ఫోర్ కూడా రాలేదంటే ఇన్నింగ్స్ ఎంత మందకొడిగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 23) తో కలిసి షఫాలీ రెండో వికెట్‌కు 43 పరుగులు జతచేసినా ఈ ఇద్దరూ సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 12వ ఓవర్లో షఫాలీ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కూడా ఆచితూచి ఆడింది. 16వ ఓవర్లో రోడ్రిగ్స్ పెవిలియన్ చేరినా దీప్తి శర్మ (7 నాటౌట్) అండతో హర్మన్ టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చింది.
పెరగని నెట్ రన్‌రేట్..
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో మాత్రం పాకిస్థాన్ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో దారుణంగా ఓడటంతో భారత నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. ఇక పాక్‌తో మ్యాచ్‌లో భాగంగా ఛేదనలో భారత ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లే నమోదయ్యాయి. టాపార్డర్ బ్యాటర్లంతా వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో పాక్‌పై గెలిచినప్పటికీ మన నెట్ రన్‌రేట్ (-1.127) మైనస్‌లోనే ఉంది. పాకిస్థాన్ (+0.555) మూడో స్థానంలో మెరుగ్గా ఉంది. సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే భారత్ రాబోయే శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించడం అవసరం. గ్రూప్ దశలో టాప్-2లో ఉన్న జట్లే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 105/8 (నిదా దర్ 28, మునీబా 17, అరుంధతి 3/19, శ్రేయాంక 2/12)
భారత్: 18.5 ఓవర్లలో 108/4 (షఫాలీ 32, హర్మన్‌ప్రీత్ 29, ఫాతిమా 2/23, ఒమైమ 1/17)