ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డ చోట.. హిట్‌మ్యాన్ రోహిత శర్మ ఆణిముత్యంలాంటి సెంచరీతో అలరించాడు. నాణ్యమైన బౌలింగ్ వనరులున్న ఆసీస్ కవ్విస్తున్నా.. ఓపికగా క్రీజులో నిలిచిన భారత సారథి టీమ్ఇండియాకు మెరుగైన స్కోరు అందించాడు. పుజారా, కోహ్లీతో పాటు.. అరంగేట్ర ఆటగాళ్లు సూర్యకుమార్, శ్రీకర్ భరత్ విఫలమైనా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అదరగొట్టడంతో టెస్టు మ్యాచ్ రెండో రోజే భారత్ పట్టు బిగించింది.
నాగ్‌పూర్: బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సారథిగా తొలి టెస్టు సెంచరీ ఖాతాలో వేసుకోగా.. రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో రాణించారు. నైట్ వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ (23) ఎక్కువసేపు నిలువలేకపోగా.. స్టార్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12) విఫలమయ్యారు. ఒకవైపు వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. రోహిత్ నింపాదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
అరంగేట్ర ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, కోన శ్రీకర్ భరత్ చెరో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే బౌలింగ్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. ఫలితంగా రోహిత్ టెస్టు క్రికెట్లో 9వ శతకం తన పేరిట రాసుకున్నాడు. అనంతరం స్టీవ్ స్మిత్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన హిట్‌మ్యాన్.. ఈ అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఇక భారత్‌కు భారీ ఆధిక్యం దక్కడం కష్టమే అనుకుంటున్న తరుణంలో జడేజా, అక్షర్ ఆదుకున్నారు. వీరిద్దరూ అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ముఖ్యంగా జడ్డూ అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మార్ఫే 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం 144 పరుగుల ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన మూడో రోజు మరెన్ని పరుగులు జత చేస్తుందో చూడాలి.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177, భారత్ తొలి ఇన్నింగ్స్: 321/7 (రోహిత్ 120, జడేజా 66 బ్యాటింగ్; మార్ఫె 5/82).