రాజ్‌గిర్(బీహార్): మహిళల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్ 3-0 తేడాతో చైనాపై అద్భుత విజయం సాధించింది. టీమ్ఇండియా తరఫున సంగితా కుమారి(32ని), కెప్టెన్ సలీమా టెటె(37ని), దీపిక(60ని) గోల్స్ చేశారు.
తమ(9) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న చైనా(6)పై భారత్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. వరుసగా నాలుగో విజయంతో భారత్ ప్రస్తుతం 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, చైనా(6) రెండో స్థానంలో ఉంది. ఆదివారం జరిగే సెమీస్‌లో భారత్..జపాన్‌తో తలపడుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే..సొంత గడ్డపై అభిమానుల మద్దతు మధ్య టీమ్ఇండియా ఆది నుంచే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మ్యాచ్ 32వ నిమిషంలో సంగీత ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరువగా, ఐదు నిమిషాల తేడాతో సలీమ మరో గోల్ చేసింది. దీంతో టీమ్ఇండియాకు 2-0 ఆధిక్యం దక్కింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా దీపిక చేసిన పెనాల్టీ కార్నర్ గోల్‌తో భారత్ భారీ విజయం ఖరారైంది.