IND vs SL | దుబాయ్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో బుధవారం మరో కీలక పోరుకు తెరలేవనుంది. సంక్లిష్టంగా ఉన్న సెమీస్ అవకాశాలను దాటుకుని రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి టీమ్ఇండియా.. శ్రీలంకతో తలపడనుంది. నెట్ రన్‌రేట్ అత్యంత కీలకమైన భారత్‌కు ఈ మ్యాచ్‌లో అసాధారణ ఆటతీరుతో ప్రత్యర్థిని ఓడిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. గ్రూప్-ఏలో పాకిస్థాన్‌తో పాటు రెండేసి మ్యాచ్‌లు ఆడినా భారత్ నెట్ రన్‌రేట్ -1.127తో నాలుగో స్థానంలో ఉండగా పాక్‌కు +0.055తో మూడో స్థానాన ఉంది. ఈ నేపథ్యంలో లంకతో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే భారత్ సెమీస్ రేసులో నిలుస్తుంది.
ఈ టోర్నీలో ఆడిన గత రెండు మ్యాచ్‌లలో భారత్ బ్యాటింగ్ విభాగం విఫలమైంది. ధనాధన్ ఆటతో ఆది నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడే షషాలీ వర్మ, స్మృతి మంధాన క్రీజులో నిలబడలేకపోతున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో షఫాలీ 2 పరుగులే చేయగా మంధాన 12 రన్స్ చేసింది. పాక్‌తో షఫాలీ 32 పరుగులతో రాణించినా ఆమె సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడింది. మంధాన 7 పరుగులే చేసి నిష్క్రమించింది. జెమీమా, రిచా వంటి హిట్టర్లు భారీ షాట్లు ఆడాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు గాయం కాగా లంకతో ఆమె ఆడేది అనుమానంగానే ఉంది. దీంతో మిడిలార్డర్లో జెమీమా, రిచాపై అదనపు భారం పడనుంది.
ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన లంకకూ ఈ మ్యాచ్ కీలకమే. నేటి పోరులో ఓడితే ఆ జట్టు ప్రపంచకప్ నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే అవుతుంది. సారథి చమరీ ఆటపట్టు మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే. గత రెండు మ్యాచ్‌లలో ఓడినా లంకను తేలికగా తీసుకుంటే తప్పులో కాలేసినట్టే అన్న విషయం భారత్‌కు బాగా గుర్తే. ఈ ఏడాది ముగిసిన ఆసియా కప్‌లో ఆ జట్టు భారత్‌కు షాకిచ్చిన విషయాన్ని మన అమ్మాయిలు మరువరాదు.