అహ్మదాబాద్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత మహిళల జట్టు మంగళవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో టీమ్ఇండియా నెగ్గగా రెండో వన్డేను కివీస్ సొంతం చేసుకోవడంతో మంగళవారం జరుగబోయే మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. గత రెండు మ్యాచ్‌లలో బౌలర్లు రాణించినా భారత బ్యాటింగ్ లైనప్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండో వన్డేలో టాపార్డర్ విఫలమైంది.
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గత రెండు మ్యాచ్‌లలో చేసినవి 5 పరుగులే. తొలి వన్డేలో ఫర్వాలేదనిపించినా గత మ్యాచ్‌లో షఫాలీ, జెమీమా చేతులెత్తేశారు. రెండో వన్డేలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయింది. బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతున్న తరుణంలో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో భారత్ ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరం. రాధా యాదవ్ ఆల్‌రౌండ్ షో తో మెరుస్తుండటం భారత్‌కు కలిసొచ్చేదే. మరోవైపు ఇటీవలే ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన కివీస్.. మూడో వన్డేలోనూ గెలిచి వన్డే సిరీస్ ట్రోఫీని ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 1:30 నుంచి ఆరంభమయ్యే మ్యాచ్ స్పోర్ట్స్-18లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.