సింగపూర్: ఆసియా ఆర్చరీ కప్ స్టేజ్-2లో భారత్‌కు తొమ్మిది పతకాలు దక్కాయి. వేర్వేరు టీమ్విభాగాల్లో ఐదు జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించినా అన్నింట్లో భారత్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాలతో సరిపెట్టుకుంది. టోర్నీలో మొత్తంగా భారత ఆర్చర్లు రెండు స్వర్ణాలు సహా, ఆరు రజతాలు, ఒక కాంస్యం ఖాతాలో వేసుకున్నారు. భారత ఆర్చర్లు తమ కంటే తక్కువ సీడ్ ప్లేయర్ల చేతిలో ఓటమిపాలై రజత పతకాలకు పరిమితమయ్యారు. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో విష్ణుచౌదరి, పారాస్ హుడా, జుయెల్ సర్కార్‌తో కూడిన భారత త్రయం 0-6తో జపాన్ చేతిలో ఓడింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చౌదరీ, వైష్ణవి పవార్ జోడీ 32-35తో ఇండోనేషియాపై ఓడి రజతంతో సంతృప్తిపడింది. మరోవైపు పురుషుల కాంపౌండ్ ఫైనల్లో కుశాల్దలాల్ 149-143తో జోషు వా మనాన్ (ఆస్ట్రేలియా) పై గెలిచి పసిడితో మెరిశాడు. మహిళల విభాగంలో తేజల్ సాల్వే 146-144తో భారత్‌కే చెందిన షణ్ముకినాగ సాయిపై గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది.
రసవత్తరంగా గాలె టెస్టు
గాలె: శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులు.. 485 పరుగులకు ఆలౌట్ కాగా పర్యాటక బంగ్లాకు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. షద్మన్ ఇస్లాం (76) అర్ధ శతకంతో మెరవగా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు కెప్టెన్ నజ్ముల్ (56*), ముష్ఫీకర్ (22*) క్రీజులో ఉన్నారు.