ఢాకా : ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో భారత అమ్మాయిల విజయపరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్ విజయంతో మొదలైన భారత ప్రస్థానం అప్రతిహతంగా సాగుతున్నది. తాజాగా అంధుల మహిళల ప్రపంచకప్ విజయం మరువకముందే కబడ్డీలో మనకు తిరుగులేదని నిరూపించారు. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్‌కప్‌లో భారత్ విజయదుందుభి మోగించింది. సోమవారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 35-28తో చైనీస్ తైపీపై అద్భుత విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు సార్థకతను చేకూరుస్తూ వరుసగా రెండోసారి మన అమ్మాయిలు ప్రపంచకప్ టోర్నీని సగర్వంగా ముద్దాడారు. మెగాటోర్నీలో అపజయమెరుగని భారత్ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ప్రపంచ కబడ్డీపై తమ ఆధిపత్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ కోర్టులో తిరుగులేదని చాటిచెప్పింది.
దుర్బేధ్యమైన డిఫెన్స్‌కు తోడు మెరుపు రైడింగ్‌తో ప్రత్యర్థి జట్లకు భారత్ దడ పుట్టించింది. అంతర్జాతీయ కబడ్డీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న చైనీస్ తైపీ టీమ్‌కు తుది పోరులో టీమ్ఇండియా దీటైన రీతిలో చెక్ పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవమున్న భారత్.. చైనీస్ తైపీని మట్టికరిపించింది. మ్యాచ్‌లో మొదట చైనీస్ తైపీ రైడర్లు మెరుపు రైడింగ్‌తో పాయింట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేయగా, తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ భారత్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో సంజూ దేవి సూపర్ రైడ్‌తో మ్యాచ్ మన వైపు మొగ్గుచూపింది. కీలకమైన ద్వితీయార్ధంలోనూ అదే దూకుడు కొనసాగించిన మన జట్టుకు కెప్టెన్ రితూ నెగీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి ప్లేయర్‌ను ట్యాకిల్ చేసే సమయంలో రితూ చేతికి గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే కోర్టును వీడాల్సి వచ్చింది. కెప్టెన్ లోటును భర్తీ చేస్తూ ఎక్కడా వెనుకకు తగ్గని సహచర ప్లేయర్లు జట్టును విజయం వైపు నిలుపడంలో సఫలమయ్యారు.