ఆసియా మహిళల జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఫైనల్లో థాయిలాండ్‌పై అమ్మాయిల అద్భుత విజయం
ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత
దేశీయంగా పెద్దగా ఆదరణ లేని క్రీడ.. ఈ ఆట ఎవరైనా ఆడతారా? అనే అనుమానాలు!
అసలు అదొక గేమ్ ఉందా? అని ప్రశ్నించే గొంతులు! శిక్షణకు సౌలత్లు లేకున్నా..
ఇతరులు నిరుత్సాహపరుస్తున్నా.. తగ్గేదేలే అంటూ మన అమ్మాయిలు విజృంభించారు!
హ్యాండ్‌బాల్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని కొల్లగొట్టి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు!!
సిటీబ్యూరో, మార్చి 14 : భారత హ్యాండ్‌బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. ఆసియా మహిళల జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు స్వర్ణం కొల్ల గొట్టారు. కజకిస్థాన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18తో థాయిలాండ్‌ను చిత్తుచేసి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంతో భారత్ తొలిసారిగా మహిళల జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించింది. మ్యాచ్ ప్రథమార్థంలో 20-9తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన భారత్.. ద్వితీయార్థంలోనూ అదేస్థాయి ప్రదర్శన కొనసాగించింది. సమయం ముగిసేలోపు రెండింతలు ఆధిక్యంలో నిలిచిన మన అమ్మాయిలు మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన భావన శర్మ ‘ఉత్తమ ప్లేయర్’, ‘ఉత్తమ సెంటర్ బ్యాక్ ప్లేయర్’ అవార్డులు పొందగా.. ఉత్తమ గోల్‌కీపర్‌గా చేతన శర్మ నిలిచింది. మూడు విజయాలు.. ఒక ఓటమితో.. ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. జూన్ 22 నుంచి స్లోవేనియా వేదికగా జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మన అమ్మాయిలు బరిలోకి దిగనున్నారు.
అద్వితీయ ప్రదర్శనతో అమ్మాయిలు సరికొత్త చరిత్ర లిఖించారు. వారి ప్రదర్శనకు భారత్ గర్విస్తున్నది. ఆసియా చాంపియన్‌గా నిలువడం.. ప్రపంచ చాంపియన్ షిప్‌నకు అర్హత సాధించడం మొట్టమొదటిసారి. అమ్మాయిల ప్రదర్శన చూసి ఎంతో గర్విస్తున్నా. – అరిశనపల్లి జగన్మోహన్రావు, భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు