బులవాయో(జింబాబ్వే): ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో అమెరికాను చిత్తు చేసిన టీమ్ఇండియా..మలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భరతం పట్టింది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో లీగ్ పోరులో యువ భారత్ 18 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి) అద్భుత విజయం సాధించింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన యువ భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకెళుతుండగా, బంగ్లా బోణీ కోసం ఎదురుచూస్తున్నది.
మ్యాచ్ విషయానికొస్తే సవరించిన లక్ష్యఛేదన(29 ఓవర్లలో 165) కోసం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్ విహాన్ మల్హోత్ర (4/14) ధాటికి బంగ్లా 40 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఐజిజుల్ హకీం(51) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. వర్షం అంతరాయం కల్గించే సమయానికి బంగ్లా 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.
అంతకుముందు అభిజ్ఞాన్కుందు(112 బంతుల్లో 80, 4ఫోర్లు, 3సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ(67 బంతుల్లో 72, 6ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో 48.4 ఓవర్లలో 238 పరుగులు చేసింది. అల్ ఫహాద్(5/38) ఐదు వికెట్లతో విజృంభించాడు. కెప్టెన్ ఆయూశ్ మాత్రె(6), వేదాంత్ త్రివేది(0), విహాన్ మల్హోత్ర(7), హర్వంశ్(2), అంబరీశ్(5) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. నాలుగు వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన విహాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
విహాన్ స్పిన్ మాయ: భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. నిర్దేశిత లక్ష్యఛేదన కోసం బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపేశ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ జావద్ అబ్రార్(5)..హెనిల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఫ్‌సైడ్ ఆఫ్‌స్టంట్ దిశగా వెళుతున్న బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అబ్రార్ బౌండరీ దగ్గర పటేల్ చేతికి చిక్కాడు. కెప్టెన్ ఐజిజుల్ హకీం, రిఫత్ బేగ్(37) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు.
యువ భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ముఖ్యంగా హకీం మంచి పరిణతి కనబరుస్తూ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. సాఫీగా సాగుతున్న క్రమంలో కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో బేగ్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కలామ్ సిద్దికి(15)తో కలిసి హకీం ఇన్నింగ్స్ బాధ్యతను భుజానేసుకున్నాడు. వీరిద్దరు భారత బౌలర్లను విసిగిస్తూ పరుగులు సాధించారు. అయితే వర్షం అంతరాయంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అర్ధగంట తర్వాత మొదలైన మ్యాచ్‌లో బంగ్లా ఘోరంగా తడబడింది.
అప్పటి వరకు క్రీజులో కుదురుకున్న బంగ్లా బ్యాటర్లు..స్పిన్నర్లు విహాన్, కిలాన్ పటేల్(2/35) ధాటికి కుదేలైంది. సిద్దికి వికెట్‌తో మొదలైన పతనం ఆఖరి వరకు కొనసాగింది. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు స్పిన్నర్లతో దాడి చేయడం టీమ్ఇండియాకు కలిసి వచ్చింది. ఓవైపు విహాన్, మరో ఎండ్‌లో కిలాన్ పోటీపడి వికెట్లు తీయడంతో బంగ్లా చేష్టలుడిగిపోయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు వికెట్లు ఇచ్చుకోవడంతో భారత్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. బషీర్(2)క్యాచ్‌ను సూర్యవంశీ బౌండరీ దగ్గర పట్టిన క్యాచ్ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది.
బంగ్లాకు టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆయూశ్ మాత్రె నిరాశపర్చగా, వేదాంత్ కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. కష్టాల్లో ఉన్న భారత్‌ను అభిజ్ఞాన్, వైభవ్ ఒడ్డున పడేశారు. తన సహజశైలికి భిన్నంగా సూర్యవంశీ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, కుందు ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారాడు. వీరిద్దరు బంగ్లా బౌలింగ్ దాడిని నిలువరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిడిలార్డర్ పూర్తిగా విఫలం కాగా, ఆఖర్లో కనిష్క్ ఇన్నింగ్స్‌తో భారత్ రెండు వందల మార్క్ దాటింది.
భారత్: 48.4 ఓవర్లలో 238 ఆలౌట్(అభిజ్ఞాన్ 80, వైభవ్ 72, ఫహాద్ 5/38, హకీం 2/42), బంగ్లాదేశ్: 28.3 ఓవర్లలో146 ఆలౌట్(హకీం 51, రిఫాత్ 37, విహాన్ 4/14, కిలాన్ 2/35)