గుమి(దక్షిణకొరియా): ప్రతిష్టాత్మక ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఘనంగా ముగించింది. అంచనాలకు మించి రాణిస్తూ భారత అథ్లెట్లు 24 పతకాలతో సత్తాచాటారు. టోర్నీ మొత్తమ్మీద భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్య పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. చైనా(19 స్వర్ణాలు, 9 రజతాలు, 4కాంస్యాలు), జపాన్(5 స్వర్ణాలు, 11 రజతాలు, 12 కాంస్యాలు) వరుసగా ఒకటి, మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. పోటీలకు ఆఖరి రోజైన శనివారం వేర్వేరు ఈవెంట్లలో మన అథ్లెట్లు ఆరు పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
మహిళల 4X100 మీటర్ల రిలే రేసులో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గందె, అభినయ రాజరాజన్, స్నేహ ఎస్ఎస్, సర్బనీ నందతో కూడిన భారత బృందం సీజన్ బెస్ట్ నమోదు చేస్తూ 43.86సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంతో రజత పతకం దక్కించుకుంది. చైనా(43.28సె), థాయ్‌లాండ్(44.26సె) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. ఈ పోటీలో నిత్య అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రజతం దక్కడంలో కీలకమైంది. మరోవైపు మహిళల 5000మీటర్ల రేసులో పారుల్ చౌదరీ 15:15:33సెకన్ల టైమింగ్‌తో రజతం ఖాతాలో వేసుకుంది. పురుషుల జావెలిన్‌త్రోలో సచిన్ యాదవ్ 85.16మీటర్ల దూరంతో రజతం సొంతం చేసుకున్నాడు. పురుషుల 200మీటర్ల రేసును అనిమేశ్ కుజుర్ జాతీయ రికార్డు టైమింగ్ 20.32 సెకన్లతో కాంస్యం కైవసం చేసుకున్నాడు. మహిళల 800మీటర్ల రేసులో పూజ తన అత్యుత్తమ వ్యక్తిగత టైమిం గ్(2:01:89సె)తో కాంస్యం దక్కించుకోగా, 400మీటర్ల హర్డిల్స్‌లో విత్యరామ్రాజ్ కాంస్యం కైవసం చేసుకుంది.