దిగ్గజాల నిష్క్రమణ వేళ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టు అద్భుతమే చేసింది. ప్రతిష్టాత్మక ఓవల్‌లో ఆతిథ్య జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడినా.. చివరికి భారత్‌నే గెలుపు వరించింది. ఐదో టెస్టులో నెగ్గి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలని ఆశించిన ఇంగ్లండ్‌కు ఐదో రోజు 35 పరుగులు అవసరమవగా సిరీస్‌ను సమం చేసుకునేందుకు భారత జట్టుకు 4 వికెట్లు కావాల్సిన దశలో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన అనుభవన్నంతా రంగరించి అతడి కెరీర్లోనే మరుపురాని ప్రదర్శనతో మాయ చేశాడు. ప్రత్యర్థిని విజయానికి 6 పరుగుల దూరంలో ఆలౌట్ చేసి టీమ్ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్‌తో ఆధ్యంతం హోరాహోరీగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో గిల్ సేన డ్రా చేసుకుంది.
ఓవల్: సుమారు 40 రోజులుగా టెస్టు క్రికెట్ అభిమానులకు అసలైన టెస్టు మజాను పంచిన ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఐదో టెస్టు ఆఖరి రోజు ఉత్కంఠభరితమైన ముగింపు! సిరీస్ సమం కోసం భారత్, గెలుపు కోసం ఇంగ్లండ్.. చివరి క్షణం దాకా హోరాహోరీగా పోరాడిన వేళ చివరికి ఓవల్ టెస్టులో టీమ్ఇండియానే విజయం వరించింది. ఐదో రోజు ఇంగ్లండ్ 4 వికెట్లను 8.4 ఓవర్లలోనే పడగొట్టిన శుభ్‌మన్ గిల్ సేన.. ఆరు పరుగుల తేడాతో గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రా చేసి ఈ సిరీస్‌కు ఘనమైన ముగింపునిచ్చింది. 374 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 367 రన్స్ వద్ద ఆగిపోయింది. మహ్మద్ సిరాజ్ (5/104) ఐదు వికెట్లతో ఇంగ్లిష్ జట్టును బెంబేలెత్తించగా ప్రసిద్ధ్ కృష్ణ (4/126) నాలుగు వికెట్లు పడగొట్టాడు. భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా సిరీస్ ఆసాంతం బ్యాట్‌తో రాణించిన భారత సారథి గిల్ (754 రన్స్), ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (481)కు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.
గంటలోపే ముగించారు
ఓవల్‌లో గెలిచే జట్టేదో తెలిసేందుకు గాను వరుణుడు ఆటను ఐదో రోజుకు వాయిదావేయగా ఆఖరి రోజు భారత విజయానికి పెద్దగా టైం (8.4 ఓవర్లు) పట్టలేదు కానీ డ్రామాకైతే కొదవలేదు. గెలుపునకు 35 పరుగుల దూరంలో ఆఖరి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. సిరాజ్, ప్రసిద్ధ్ ద్వయం పేస్ ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా సిరాజ్ అయితే నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఐదో రోజు ప్రసిద్ధ్ తొలి ఓవర్లోనే ఓవర్టన్ (9) రెండు బౌండరీలు కొట్టాడు. కానీ సిరాజ్ వరుస ఓవర్లలో పోప్ సేనకు భారీ షాకులిచ్చాడు. అతడు వేసిన మొదటి ఓవర్లో (ఇన్నింగ్స్ 78వ)నే ఆఫ్‌సైడ్ తక్కువ ఎత్తులో వచ్చిన బంతి.. స్మిత్ (2) బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ జురెల్ చేతుల్లో పడింది. ఇదే ఊపులో మియా భాయ్.. తన తరువాతి ఓవర్లో ఓవర్టన్నూ ఇన్‌స్వింగర్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కొద్దిసేపటికే ప్రసిద్ధ్.. టంగ్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో టెస్టు తొలిరోజు ఫీల్డింగ్ చేస్తూ భుజం గాయంతో మూడు రోజులు ఆటకు దూరమైన క్రిస్ వోక్స్.. ఎడమ చేతికి కట్టు ఉన్నా బ్యాటింగ్ చేయడానికి వచ్చి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.
చారిత్రాత్మక గెలుపు క్షణాలు..
క్రీజులో ఉన్న అట్కిన్సన్ (17).. సిరాజ్ 84వ ఓవర్లో ఓ సిక్సర్‌తో పాటు ప్రసిద్ధ్ ఓవర్లో మరో 3 రన్స్ తీయడంతో ఇంగ్లండ్ గెలుపు సమీకరణం 7 పరుగులుగా మారింది. ఆ మరుసటి ఓవర్లో బంతినందుకున్న సిరాజ్.. తొలి బంతిని 143 కిలోమీటర్ల వేగంతో ఆఫ్‌స్టంప్‌నకు గురిపెట్టి యార్కర్ సంధించాడు. దానిని ఆడటంలో అట్కిన్సన్ మిస్ అయినా సిరాజ్ గురి తప్పలేదు. ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. అంతే..! భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది భారతీయ క్రికెట్ అభిమానులు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. టెస్టుల్లో భారత జట్టు ఇంత తక్కువ పరుగుల తేడాతో గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
బజ్‌బాల్‌ను వణికించి..
నిర్జీవమైన పిచ్‌లపై బంతితో తేలిపోతున్నా బ్యాట్‌తో ప్రత్యర్థులపై టెస్టుల్లో టీ20 తరహా ఆటతో అలరిస్తూ తమ ఆటకు ‘బజ్‌బాల్’ అని పేరు పెట్టుకున్న ఇంగ్లండ్‌కు ఈ సిరీస్‌లో భారత్ చుక్కలు చూపెట్టింది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టును మినహాయిస్తే మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ యువ భారత జట్టు.. బజ్‌బాల్ దూకుడుకు ఎక్కడా తలొగ్గలేదు. దిగ్గజాల నిష్క్రమణ వేళ జట్టు సారథ్య పగ్గాలు అందుకున్న నాయకుడు శుభ్‌మన్ గిల్.. జట్టులో తనదైన ముద్ర వేస్తూనే ఏమాత్రం అవకాశమొచ్చినా ఇంగ్లండ్ ఆటగాళ్లతో అమీతుమీ తేల్చుకునేందుకు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తొలి టెస్టులో టీమ్ఇండియా.. ఇంగ్లిష్ బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్లుగా మార్చుతూ ఏకంగా ఐదు శతకాలు నమోదుచేసింది. ఆ మ్యాచ్‌లో గెలుపు ముంగిట నిలిచినా ఓటమి పాలైన టీమ్ఇండియా.. బర్మింగ్‌హామ్‌లో మాత్రం మరింత రెచ్చిపోయింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లండ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో 52 పరుగులే చేసిన గిల్.. కెప్టెన్ కమ్ బ్యాటర్‌గా వందకు రెండు వందల శాతం సక్సెస్ అయ్యాడు.
రెండో టెస్టులో అతడు ఏకంగా సెంచరీతో పాటు ద్విశతకంతో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 336 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. లార్డ్స్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన భారత్.. 22 రన్స్ తేడాతో అపజయం పాలైంది. సాధారణంగా మ్యాచ్‌లో ఓవర్‌కు 4కు పైగా రన్‌రేట్‌తో జోరు చూపించే ఇంగ్లండ్.. లార్డ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 2.75 నుంచి 3 రన్‌రేట్ సాధించేందుకే తంటాలు పడింది. స్టోక్స్, మెక్కల్లమ్ బజ్‌బాల్ ఎరాలో ఇలా జరుగడం ఇది రెండోసారి మాత్రమే. మాంచెస్టర్‌లో గిల్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ అసాధారణ పోరాటానికి బజ్‌బాల్ పప్పులేమీ ఉడకలేదు. ‘ఇక చాలు మహాప్రభో! మాకు ఓపిక నశించింది. మీరు ఆడటం ఆపండి’ అని స్టోక్స్, ఇతర ఇంగ్లండ్ ఆటగాళ్లు వేడుకున్నా భారత్ కనుకరించలేదు. ఇక సిరీస్ నిర్ణయాత్మక ఓవల్‌లో ఆరంభంలో బౌలర్లు చెలరేగి ఆతిథ్య జట్టుకు ఆధిక్యం ఇచ్చినా చివరి రెండు సెషన్లలో మ్యాచ్‌ను భారత్ లాగేసుకుంది. ప్రస్తుత జట్టులో రాహుల్, జడేజా, పంత్, బుమ్రా, సిరాజ్ మినహా మిగిలినవారంతా ఇంగ్లండ్ పర్యటనకు కొత్తే అయినా అందరూ సమిష్టిగా రాణించి ప్రత్యర్థికి దీటుగా బదులిస్తూ ఐదు మ్యాచ్‌లనూ ఐదు రోజుల పాటు తీసుకెళ్లి అసలైన టెస్టు మజాను పంచారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 224 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 396 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 85.1 ఓవర్లలో 367 ఆలౌట్ (బ్రూక్ 111, రూట్ 105, సిరాజ్ 5/104, ప్రసిద్ధ్ 4/126)