కింగ్ కోహ్లీ కళాత్మక సెంచరీకి.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్ధశతకాలు తోడవడంతో లంకతో సిరీస్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన గువాహటి పిచ్‌పై టాప్-3 దంచికొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో లంకేయులు పోరాడినా విజయానికి చాలా దూరంలో నిలిచిపోయారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జోరుకు ముకుతాడు వేయగా.. ఉమ్రాన్ మాలిక్ బుల్లెట్ వేగంతో బంతులేస్తూ మూడు
వికెట్లు పడగొట్టాడు.
గువాహటి: ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించిన భారత క్రికెట్ జట్టుకు ఆ దిశగా శుభారంభం లభించింది. ఈ ఏడాది ఆడిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఇప్పటికే లంకేయులపై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి బర్సాపారా స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన
రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (67 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (60 బంతుల్లో 70; 11 ఫోర్లు) మెరుపు అర్ధశతకాలు నమోదు చేశారు.
అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక (88 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. నిషాంక (72; 11 ఫోర్లు), ధనంజయ (47; 9 ఫోర్లు) రాణించారు. మన బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వన్డే జరుగనుంది.
కొట్టుడే కొట్టుడు..
టీమ్ఇండియా చివరగా ఆడిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోగా.. లంకతో చివరి టీ20లో విధ్వంసక శతకం బాదిన సూర్యకుమార్‌కు కూడా చుక్కెదురైంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించిన శుభ్‌మన్ గిల్.. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఒకవైపు రోహిత్ విధ్వంసం కొనసాగిస్తుంటే.. గిల్ ఫీల్డర్ల మధ్యలో నుంచి పరుగులు రాబడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించి
శుభారంభం అందించగా.. ఆ పునాదిపై కోహ్లీ భారీ సౌధాన్ని నిర్మించాడు.
తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో అలరించిన విరాట్.. వన్డే క్రికెట్లో 45వ శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంకపై అత్యధిక (9) సెంచరీలు చేసిన ఆటగాడిగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (8)ను అధిగమించాడు. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39) కూడా ఫర్వాలేదనిపించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టాడు.
1వన్డేల్లో శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ(9) నిలిచాడు. ఈ క్రమంలో సచిన్(8) రికార్డును విరాట్ అధిగమించాడు.
స్వదేశంలో వన్డేల్లో సచిన్(20) అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ తాజాగా సమం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 373/7 (కోహ్లీ 113, రోహిత్ 83; రజిత 3/88) శ్రీలంక: 50 ఓవర్లలో 306/8 (షనక 108*, నిషాంక 72; ఉమ్రాన్ 3/57).