IND vs IRE | రాజ్‌కోట్: స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో స్మృతి మంధాన సారథ్యంలోని భారత్.. 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. యువ బ్యాటర్లు ప్రతీక రావల్ (96 బంతుల్లో 89, 10 ఫోర్లు, 1 సిక్స్), తేజల్ హసబ్నిస్ (46 బంతుల్లో 53 నాటౌట్, 9 ఫోర్లు) రాణించడంతో ఐర్లాండ్ నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 34.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 241 స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌కు సారథి గాబీ లూయిస్ (129 బంతుల్లో 92, 15 ఫోర్లు), లీ పాల్ (73 బంతుల్లో 59, 7 ఫోర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా (2/56) రెండు వికెట్లు తీయగా సయాలి (1/43), టిటాస్ (1/48), దీప్తి (1/41) తలా ఓ వికెట్ పడగొట్టారు. ప్రతీకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం ఇదే వేదికపై జరుగనుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ టాపార్డర్ వైఫల్యంతో 56 పరుగులకే 4 కీలక వికెట్లను చేజార్చుకుంది. ప్రియా, టిటాస్ కట్టుదిట్టంగా బంతులేసి ఐర్లాండ్‌ను నియంత్రించారు. కానీ ఐదో వికెట్‌కు గాబీతో జతకలిసిన పాల్.. భారత బౌలర్లను సమర్థవంతంగా నిలువరించింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే 39వ ఓవర్లో లీ పాల్ రనౌట్ అవడంతో ఆ జట్టు మళ్లీ గాడి తప్పింది. శతకం దిశగా సాగుతున్న గాబీ.. దీప్తి వేసిన 44వ ఓవర్లో ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చింది. ఆఖర్లో అర్లెనె కెల్లీ (28) ఐర్లాండ్ స్కోరును 200 పరుగుల మార్కును దాటించింది.
ఛేదనను భారత్ దూకుడుగా ఆరంభించింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మంధాన (29 బంతుల్లో 41, 6 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు రాబట్టింది. జార్జియానా వేసిన 8వ ఓవర్లో మంధాన.. 4, 6, 4 బాదింది. ప్రతీక కూడా వేగంగా ఆడటంతో రన్‌రేట్ 6కు తగ్గకుండా సాగింది. దూకుడుగా ఆడే క్రమంలో మంధాన.. ఫ్రెయా వేసిన 10వ ఓవర్లో ఫ్రెండర్గస్ట్ చేతికి క్యాచ్ ఇవ్వడంతో 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హర్లీన్ డియోల్ (20) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. జెమీమా (9) స్టంపౌట్ అయి నిరాశపరిచింది.
ఈ క్రమంలో ప్రతీక, తేజల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అంతగా అనుభవం లేకున్నా పరిణితితో కూడిన ఆటతీరును ప్రదర్శించారు. 70 బంత్లులో తన కెరీర్లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసిన ప్రతీక ఆ తర్వాత వేగం పెంచింది. క్రీజులో కుదురుకునే దాకా వేచి చూసిన తేజల్ సైతం.. వ్యక్తిగత స్కోరు 30 దాటాకా జూలు విదిల్చింది. మాగ్వైర్ 34వ ఓవర్లో 4, 4, 6తో 90కి చేరువగా వచ్చిన ప్రతీక మూడంకెల మార్కును అందుకునేలా కనిపించింది. కానీ అదే ఓవర్లో భారీ షాట్ ఆడబోయి ప్రెండర్గస్ట్కు క్యాచ్ ఇచ్చింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 84 బంతుల్లోనే 116 పరుగులు జతచేశారు. ఆఖర్లో రిచా ఘోష్ (8 నాటౌట్) రెండు బౌండరీలు బాది లాంఛనాన్ని పూర్తి చేసింది.
ఐర్లాండ్: 50 ఓవర్లలో 238/7 (గాబీ 92, పాల్ 59, ప్రియా 2/56, దీప్తి 1/41)
భారత్: 34.3 ఓవర్లలో 241/4 (ప్రతీక 89, తేజల్ 53 నాటౌట్, మాగ్వైర్ 3/57, ఫ్రెయా 1/38)