న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్థాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడేది లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడిన వేళ..బీసీసీఐ కఠిన చర్యలకు దిగింది.
సోషల్‌మీడియా వేదికగా తాజా, మాజీ క్రికెటర్లు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా స్పందిస్తూ ‘పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు అండగా ఉంటాం. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం. సమీప భవిష్యత్‌లో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోము.
కానీ ఐసీసీ టోర్నీల్లో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ఐసీసీకి కూడా తెలుసు’ అని అన్నాడు. భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగని సంగతి తెలిసిందే.