భారత్, వెస్టిండీస్ చరిత్రాత్మక పోరుకు సిద్ధమయ్యాయి. పోర్ట్ఆఫ్ స్పెయిన్ వేదికగా ఇరు జట్ల మధ్య వందో టెస్టు మ్యాచ్ సమరం జరుగనుంది. 1948లో ఇరు జట్ల మధ్య మొదలైన టెస్టు పోరు 2023 నాటికి వందో మ్యాచ్‌కు చేరుకుంది. ప్రతిష్ఠాత్మక పోరులో గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని టీమ్ఇండియా కదనోత్సాహంతో ఉంది. మరోవైపు ఇప్పటికే ఘోర ఓటమి చవిచూసిన విండీస్ సొంతగడ్డపై కనీసం పరువైనా నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
పోర్ట్ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య చరిత్రాత్మక వందో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలవుతున్నది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా విజయదుందుభి మోగించగా, విండీస్ కనీసం పోరాటపటిమ కనబర్చలేకపోయింది. డొమినికా పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా నిలిస్తే..పోర్ట్ఆఫ్ స్పెయిన్‌కు పేసర్లకు బాగా సహకరించనుంది. మరో ఘన విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికను ఎంచుకోబోతున్నది. క్వీన్స్ పార్క్‌లో పిచ్ పేస్‌కు సహకరించనున్న నేపథ్యంలో రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశముంది. టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
కోహ్లీపైనే కండ్లన్నీ:
తన అంతర్జాతీయ కెరీర్లో 500 మ్యాచ్ ఆడబోతున్న కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. గత కొన్ని రోజులుగా సుదీర్ఘ ఫార్మాట్లో సెంచరీ లేకుండా నిరాశపరుస్తూ వస్తున్న విరాట్…500వ మ్యాచ్‌లోనైనా చేసి ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తున్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ..ఈసారైనా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో అదరగొట్టాడు. ఇదే జోరును కొనసాగిస్తూ రెండో టెస్టులోనూ జైస్వాల్ చెలరేగితే టీమ్ఇండియా ఖాతాలో మరో విజయం చేరినట్లే. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ నిరాశపర్చగా, రహానే స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు.ఈసారి పేసర్లు సిరాజ్, ఉనద్కట్, శార్దూల్ వంతుకానుంది.
100 భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇది వందో టెస్టు పోరు. ఇప్పటి వరకు భారత్ 23 టెస్టులో గెలువగా, విండీస్ 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
500 కోహ్లీకి ఇది కెరీర్లో 500వ మ్యాచ్. కోహ్లీ ఇప్పటి వరకు 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు.