190, 141, 253, 143, 143, 27, 162, 146.. ఈ టెస్టుకు ముందు గత 8 ఇన్నింగ్స్‌లలో వెస్టిండీస్ జట్టుగా చేసిన పరుగులవి. భారత పర్యటనలోనూ అహ్మదాబాద్‌లో ఆ జట్టు కథ మూడు రోజుల్లోనే ముగియడంతో ఢిల్లీలో సైతం అదే ఫలితం పునరావృతమవుతుందని అనుకున్నరంతా. ఆ అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విఫలమై ఫాలోఆన్ ఆడిన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమే చేసింది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా వంటి ప్రపంచస్థాయి బౌలర్లను దీటుగా ఎదుర్కుని ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడటమే గాక భారత ఎదుట మూడంకెల లక్ష్యాన్ని నిర్దేశించగల్గింది. కరీబియన్లు పోరాడినా భారత జట్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌నకు 58 పరుగుల దూరంలో ఉంది.
ఢిల్లీ : సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టునూ గెలుచుకుని సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అందుకు 58 పరుగుల దూరంలో నిలిచింది. నాలుగో రోజే వెస్టిండీస్ తేలిగ్గానే లొంగుతుందని భావించినా అందుకు భిన్నంగా ఆ జట్టు అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో దారుణమైన ఆటతీరుతో తీవ్ర విమర్శలెదుర్కుంటున్న కరీబియన్లు.. ఓ అగ్రశ్రేణి జట్టుపై ఈ స్థాయిలో రాణించడం బహుశా ఇదే మొదటిసారి. ఫాలోఆన్ ఆడుతూ ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 390 పరుగులు చేయగల్గింది. జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) శతకాలతో విజృంభించగా లోయరార్డర్లో జస్టిన్ గ్రీవ్స్ (85 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు) విండీస్‌కు ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కించగా ఆఖరి వరుస బ్యాటర్ జైడన్ సీల్స్ (67 బంతుల్లో 32, 1 ఫోర్, 1 సిక్స్) భారత బౌలర్లకు చికాకు తెప్పించి ఆతిథ్య జట్టు ఎదుట 121 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు. ఛేదనలో టీమ్ఇండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో జైస్వాల్ (8) వికెట్ కోల్పోయి 63 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ (30 నాటౌట్), కేఎల్ రాహుల్ (25 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 173/2తో నాలుగో రోజు ఆట ఆరంభించిన క్యాంప్‌బెల్, హోప్.. తమ కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. జడేజా బౌలింగ్‌లో సిక్స్‌తో క్యాంప్‌బెల్ తన టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని నమోదుచేశాడు. ఉదయం సెషన్లో డ్రింక్స్ విరామం తర్వాత బంతినందుకున్న జడ్డూ.. క్యాంప్‌బెల్‌ను వికెట్ల ముందు బలిగొనడంతో 177 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. క్యాంప్‌బెల్ నిష్క్రమించినా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (40)తో కలిసి హోప్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తొలి సెషన్‌ను విండీస్ మెరుగైన స్థితితో ముగించింది. లంచ్ తర్వాత సిరాజ్ ఓవర్లో బౌండరీతో హోప్ సెంచరీ పూర్తిచేశాడు. 2017 తర్వాత టెస్టుల్లో అతడికి ఇదే మొదటి శతకం. నాలుగో వికెట్‌కు ఛేజ్‌తో 59 రన్స్ జతచేసిన క్యాంప్‌బెల్‌ను సిరాజ్ 84వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు.
హోప్ పెవిలియన్ చేరాక విండీస్ లోయరార్డర్ 30 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు కథ ముగిసినట్టే అనిపించింది. 311/9తో నిలిచిన పర్యాటక జట్టును గ్రీవ్స్, సీల్స్ మళ్లీ నిలబెట్టారు. ఈ ఇద్దరూ 22 ఓవర్లపాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించడం గమనార్హం. ఆఖరి వికెట్‌కు ఈ జోడీ 133 బంతుల్లో 79 రన్స్ జతచేసింది. ఎట్టకేలకు సీల్స్‌ను బుమ్రా ఔట్ చేయడంతో విండీస్ పోరాటం ఆగిపోయింది.
స్వల్ప ఛేదనలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జైస్వాల్ త్వరగానే నిష్క్రమించినా రాహుల్, సుదర్శన్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్‌కు ఈ జోడీ ఇప్పటికే 59 పరుగులు జోడించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఐదో రోజు ఉదయం సెషన్లోనే భారత విజయం ఖరారవడం లాంఛనమే..
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5;
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 ఆలౌట్;
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 118.5 ఓవర్లలో 390 ఆలౌట్ (క్యాంప్‌బెల్ 115, హోప్ 103, బుమ్రా 3/44, కుల్దీప్ 3/104);
భారత్ రెండో ఇన్నింగ్స్: 18 ఓవర్లలో 63/1 (సాయి 30*, రాహుల్ 25*, వారికన్ 1/15)