ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న భారత జట్టు.. మరో సిరీస్‌కు సిద్ధమైంది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో శిఖర్ ధవన్ సారథ్యంలోని యంగ్‌ఇండియా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుండగా.. తొలి పోరులో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): వరుస విజయాల ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టు.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు సన్నద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగనుండగా.. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రోహిత్, కోహ్లీ, పంత్, పాండ్యా, బుమ్రా, షమీ వంటి సీనియర్ల గైర్హాజరీలో యువకులతో కూడిన జట్టుకు శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్నాడు. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే జట్టులో కొనసాగుతున్న ధవన్ సత్తాచాటేందుకు ఇది సరైన వేదిక కాగా.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యంగ్ ప్లేయర్స్ తమ ముద్ర వేయాలని తహతహలాడుతున్నారు. ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా బ్యాటింగ్‌కు రానుండగా.. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతున్న విండీస్.. టీమ్ఇండియాకు కనీస పోటీనివ్వాలని చూస్తున్నది.
సిరీస్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ చేయాలనుకున్న భారత జట్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. గురువారం భారీ వర్షం కారణంగా టీమ్ఇండియా ఆటగాళ్లు ఇండోర్ శిక్షణకే పరిమితమయ్యారు. ‘యూకే నుంచి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దామనుకుంటే.. వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఇండోర్‌లోనే శిక్షణ కొనసాగుతున్నది’అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
భారత్: ధవన్ (కెప్టెన్), రుతురాజ్/ఇషాన్, శ్రేయస్, దీపక్, శాంసన్, సూర్యకుమార్, జడేజా, శార్దూల్, ప్రసిద్ధ్, చాహల్, సిరాజ్.
వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), హోప్, బ్రాండన్, బ్రూక్స్, మయేర్స్, పావెల్, హోల్డర్, అకీల, అల్జారీ, గుడాకెశ్, సీల్స్.