భువనేశ్వర్: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ కోసం కటక్ చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెండో టీ20 జరుగనుండగా.. ఈ సారి తప్పులను సరిదిద్దుకొని సమిష్టిగా సత్తాచాటాలని పంత్ సేన భావిస్తున్నది. శుక్రవారం ఇరు జట్లు బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. వేలాది మంది అభిమానులు ప్లేయర్లకు స్వాగతం పలికారు. పటిష్ట భద్రత మధ్య హోటళ్లకు చేరుకున్న ఆటగాళ్లు శనివారం ప్రాక్టీస్ చేయనున్నారు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్లకు విశ్రాంతినిచ్చిన బోర్డు.. ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే తొలి మ్యాచ్‌లో కుర్రాళ్లు బ్యాట్‌తో ఆకట్టుకున్నా.. బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కెప్టెన్ రిషబ్ పంత్ రాణించడంతో రెండొందల పైచిలుకు పరుగులు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమైంది.