మహిళల వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ పోరుకు వేళైంది. నెలరోజులుగా జరుగుతున్న ఈ టోర్నీలో పడుతూ లేస్తూ ఫైనల్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా.. కొత్త చరిత్రను లిఖించేందుకు ఒకే ఒక విజయం దూరంలో నిలిచాయి. రెండుసార్లు టైటిల్‌కు చేరువగా వచ్చినా విఫలమై మూడో ప్రయత్నంలో అయినా సొంతగడ్డపై ట్రోఫీని సగర్వంగా ముద్దాడాలన్న లక్ష్యంతో భారత జట్టు ఉంటే.. మొదటిసారి ఈ టోర్నీ ఫైనల్ ఆడుతున్న సఫారీలూ కప్పును ఎగిరేసుకుపోయేందుకు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకున్నారు. ఈ ఇరుజట్లలో ఎవరు గెలిచినా ప్రపంచం కొత్త చాంపియన్‌ను చూడబోతున్న నేపథ్యంలో ఫినిషింగ్ టచ్ ఎవరిదవుతుందన్నది ఆసక్తికరం.
ముంబై: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఫైనల్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా.. తమ తొలి ఐసీసీ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. 13వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఏడు సార్లు విజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 4 సార్లు కప్ గెలిచిన ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన దక్షిణాఫ్రికా.. కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఆసీస్, ఇంగ్లండ్ లేకుండా తొలిసారిగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లో భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నది.

పురుషుల క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదిగిన భారత జట్టు.. మహిళా క్రికెట్లో మాత్రం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని అందిపుచ్చుకుంటే అమ్మాయిల క్రికెట్ దశ తిరిగినట్టే! భారత క్రికెట్‌ను 1983 వరల్డ్ కప్ విజయం ఎంత ప్రభావితం చేసిందో.. అమ్మాయిలకూ అలాంటి ఒక క్షణం కోసం అభిమానులు కోట్లాది కండ్లతో వేచి చూస్తున్నారు. 2005లో ఫైనల్ చేరి విఫలమైనా.. 2017 వన్డే ప్రపంచకప్‌లో ట్రోఫీకి అత్యంత చేరువగా వచ్చినా 9 పరుగుల స్వల్ప తేడాతో కప్పును చేజార్చుకుంది.
కానీ అరుదుగా వచ్చే ఇలాంటి అవకాశాలను హర్మన్‌ప్రీత్ సేన ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. 2017 ఫైనల్లో ఆడిన వారిలో హర్మన్, స్మృతి, దీప్తి శర్మ ప్రస్తుత జట్టులోనూ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత ఎడిషన్‌లో వారికి తోడు జెమీమా, రిచా, షెఫాలీ వర్మ రూపంలో భారత బ్యాటింగ్ దుర్బేధ్యంగానే ఉంది. ఇదే జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తే అమ్మాయిల కల తీరినట్టే! బ్యాటింగ్ విషయంలో భారత్‌కు బెంగేమీ లేకున్నా బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళనకు గురిచేసేదే. ఫైనల్లో రేణుకా సారథ్యంలోని బౌలింగ్ దళం ఏ మేరకు సఫారీలను కట్టడి చేయగలుగుతుందనేదానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించిన విజయోత్సవంతో ఫైనల్‌కు వచ్చిన భారత్.. దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. కెప్టెన్ లారా వోల్వార్డ్ (470 రన్స్) సూపర్ ఫామ్‌లో ఉండగా తజ్మిన్ బ్రిట్స్ (212)కు తోడు వెటరన్ ఆల్‌రౌండర్ మరిజనె కాప్ (204 రన్స్, 12 వికెట్లు), నదినె డి క్లార్క్ (190 రన్స్, 8 వికెట్లు), ట్రైయాన్ (167 రన్స్, 5 వికెట్లు) వంటి స్టార్ ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం. మ్యాచ్‌ను ఏ క్షణంలో మలుపు తిప్పగలగడంలో వీళ్లు దిట్ట. గ్రూప్ దశలో నదినె, ట్రైయాన్ జోడీ.. అవకాశాలే లేని చోట సఫారీలను విజయాతీరాలకు చేర్చి భారత్‌కు షాకిచ్చిన విషయాన్ని మరువరాదు.
డీవై పాటిల్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువే. ముంబైలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం కూడా వరుణుడు సాయంత్రం 5 గంటల తర్వాత ఆటకు అంతరాయం కల్గించే ప్రమాదం లేకపోలేదు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది.
ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా ప్రయాణం దాదాపు ఒకేలా ఉంది. ఆరంభంలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి జట్లపై విజయాల తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమ్ఇండియా.. కివీస్‌పై గెలుపుతో రేసులోకి వచ్చింది. సెమీస్‌లో అరవీర భయంకర ఆస్ట్రేలియా నిర్దేశించిన రికార్డు లక్ష్య ఛేదన (338)ను మరో ఆరు బంతులుండగానే ఛేదించి ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికాదీ అదే పరిస్థితి. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 69 రన్స్ (ఇంగ్లండ్‌తో)కే ఆలౌట్ అయి ఓటమితో టోర్నీని ఆరంభించింది. కానీ ఆ తర్వాత సఫారీలు పుంజుకున్న తీరు అద్భుతం. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చి సగర్వంగా తమ తొలి వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో ఫైనల్ (2005, 2017) కాగా దక్షిణాఫ్రికాకు మాత్రం మొదటిసారి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆధిపత్యం ఉండే మహిళా క్రికెట్లో దశాబ్దకాలంగా తమ ఉనికిని చాటుకోవడమే గాక అగ్రశ్రేణి జట్లకూ దీటుగా బదులిచ్చే జట్లుగా ఎదిగిన భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు గెలిచినా కొత్త చరిత్రే కానుంది.
భారత్: మంధాన, షెఫాలీ, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి, రిచా, అమన్‌జ్యోత్, రాధా/స్నేహ్, క్రాంతి, చరణి, రేణుకా
దక్షిణాఫ్రికా: వోల్వార్డ్, తజ్మిన్, బాష్/క్లాస్, లుస్, కాప్, జఫ్టా, డెర్క్సెన్, ట్రైయాన్, నదినె, ఖాఖా, మ్లబ