రాయ్‌పూర్: స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన టెస్టు సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత జట్టుకు చక్కని అవకాశం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు రోజుల క్రితం రాంచీలో ముగిసిన తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకుని 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. నేడు (బుధవారం) సఫారీలతో రెండో వన్డే ఆడనుంది. రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలనే పట్టుదలతో మెన్ ఇన్ బ్లూ ఉంటే.. సిరీస్ ఫలితాన్ని మూడో వన్డేకు వాయిదా వేసేలా సఫారీ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరోమారు రసవత్తర పోరు జరుగనుంది.
టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లీ మీదే అభిమానుల దృష్టంతా కేంద్రీకృతమవుతున్నది. ఈ ఇద్దరి ఆట చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. రాంచీలో సుమారు 32 వేల మంది హాజరుకాగా రాయ్‌పూర్ సైతం ‘రోకో’కు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. వన్డేలకు ఆతిథ్యమివ్వడం రాయ్‌పూర్‌కు ఇది రెండోసారి మాత్రమే కావడంతో మైదానమంతా మరోసారి రోకో నామస్మరణ చేయనుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ జోడీ సూపర్ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు సైతం ఈ దిగ్గజ ద్వయం తమ మ్యాజిక్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నది. గత వన్డేలో విఫలమైన ఓపెనర్ జైస్వాల్, రుతురాజ్ ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తారో లేదో చూడాలి. బ్యాటింగ్ పరంగా భారత్‌కు బెంగేమీ లేకపోయినా రాంచీ వన్డేలో బౌలింగ్ మాత్రం వీక్‌గా కనిపించింది. ప్రత్యర్థి ఎదుట 350 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా టీమ్ఇండియాకు విజయమేమీ సులభంగా దక్కలేదు. అయితే రాయ్‌పూర్ పిచ్ సీమర్లకు అనుకూలం. గతంలో ఇక్కడ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో భారత పేసర్లు నిప్పులు చెరిగారు. సఫారీ జట్టులో నాణ్యమైన పేసర్లున్న నేపథ్యంలో వారి బౌలింగ్ దాడిని భారత బ్యాటింగ్ లైనప్ ఏ మేరకు ఎదుర్కుంటుందన్నది ఆసక్తికరం!
గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. అతడితో పాటు స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం ఆడే అవకాశం ఉండటంతో సఫారీల బలం మరింత పెరుగనుంది. బవుమా రాకతో డికాక్, రికెల్టన్లో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. మిడిలార్డర్లో బ్రీట్జ్కే, జోర్జి, బ్రెవిస్‌తో పాటు లోయరార్డర్లో యాన్సెన్, బాష్‌తో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది.