కోల్‌కతా : ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, డబ్ల్యూటీసీ చాంపియన్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు శుక్రవారం మొదలుకానుంది. స్పిన్‌కు చిరుమానా అయిన ఈడెన్‌లో దక్షిణాఫ్రికాకు దీటైన పోటీనిచ్చేందుకు భారత్ పావులు కదుపుతున్నది. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమ్ఇండియా మెండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నది. దీనికి తోడు వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన గిల్‌సేన..అదే ఊపులో దక్షిణాఫ్రికా భరతం పట్టాలని చూస్తున్నది.
మరోవైపు పాకిస్థాన్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించుకున్న దక్షిణాఫ్రికా..భారత్‌కు బదులిచ్చేందుకు కసరత్తులు చేస్తున్నది. గతేడాది భారత గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ స్పిన్ తంత్రంతో భారత్‌ను కట్టడి చేసేందుకు కసితో ఉన్నది. సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌కు తోడు సైమన్ హర్మర్, ముత్తుస్వామి లాంటి స్పిన్నర్లతో సఫారీలు బరిలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే కివీస్‌తో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈడెన్ గార్డెన్స్ పిచ్ పూర్తిగా స్పిన్‌కు కాకుండా పేస్‌కు సహకరించే విధంగా రూపొందించినట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే టీమ్ఇండియా ముగ్గురు పేసర్లతో పోటీకి దిగే చాన్స్ ఉంది. స్పిన్ పిచ్‌తో సఫారీల ఉచ్చులో పడద్దన్న ఉద్దేశంతో టీమ్ఇండియా మేనేజ్మెంట్ కనిపిస్తున్నది.
పంత్, జురెల్‌తో : స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనేందుకు టీమ్ఇండియా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నది. ఓవైపు దుర్భేద్యమైన బ్యాటింగ్‌కు తోడు పటిష్టమైన బౌలింగ్‌తో ముప్పేట దాడికి ప్రణాళికలు రచిస్తున్నది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రాగా, నిలకడగా రాణిస్తున్న జురెల్‌ను స్పెషలిస్టు బ్యాటర్‌గా తీసుకున్నారు. టాపార్డర్‌లో రాహుల్, జైస్వాల్, సుదర్శన్, కెప్టెన్ గిల్‌తో టీమ్ఇండియా బలంగా కనిపిస్తున్నది. స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్ తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనుండగా, కుల్దీప్, సుందర్, జడేజా స్పిన్ దళాన్ని నడిపించనున్నారు.
మహారాజ్‌పై ఆశలన్నీ : సీనియర్ స్పిన్నర్ మహారాజ్‌పై దక్షిణాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే మహారాజ్..సఫారీలకు కీలకంగా వ్యవహరించనున్నాడు.