దుబాయ్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం త్వరలో రాబోతున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌లో దాయాది పాక్‌తో భారత్ తమ తొలి పోరులో తలపడనుంది. ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. ఈ నెల 27 నుంచి మొదలవుతున్న టోర్నీకి దుబాయ్, షార్జా ఆతిథ్యమిస్తున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరుగాల్సి ఉండగా, ఆ దేశంలో రాజకీయ సంక్షోభం కారణంగా యుఏఈకి తరలించారు. భారత్, పాకిస్థాన్ 28వ తేదీన ఆడనుండగా, గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తలపడనుండడం ఇదే తొలిసారి. గత రెండు ఆసియా కప్‌లలో భారత్‌దే పైచేయిగా నిలిచింది. గ్రూప్”ఎ’లో భారత్, పాకిస్థాన్, ఒక క్వాలిఫయింగ్ జట్టు, గ్రూప్ ‘బి’లో శ్రీలంక, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ పోటీపడుతాయి. ఆగస్టు 27నుంచి సెప్టెంబరు 2వరకు గ్రూప్ మ్యాచ్‌లు, సెప్టెంబరు 3నుంచి 9వ తేదీ వరకు సూపర్-4 మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబరు 11న ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగనున్న సంగతి తెలిసిందే.