దుబాయ్ : ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. టాస్ సందర్భంగా గానీ.. మైదానంలో ఆడేప్పుడు గానీ దాయాదులతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించిన టీమ్ఇండియా.. ఆట ముగిశాక కూడా పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండానే డగౌట్‌కు చేరింది. పాక్ ప్లేయర్లు మైదానంలో వేచి చూసినా భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి అలాంటి స్పందనేమీ రాలేదు. దీంతో అవమానానికి గురైన పాకిస్థాన్.. ఐసీసీ తలుపు తట్టింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ కొత్తరాగాన్ని అందుకుంది. భారత ఆటగాళ్ల చర్యకు మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిగా చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీని డిమాండ్ చేసింది. అయితే పాక్ ఆటగాళ్లతో కరచాలన చేయకపోవడాన్ని టీమ్ఇండియా సమర్థించుకుంది.
పీసీబీ.. ఐసీసీలో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక కారణముంది. టాస్ వేసేప్పుడు భారత కెప్టెన్ సూర్యతో కరచాలనం చేయవద్దని పాక్ సారథి సల్మాన్ అఘాతో చెప్పాడని పీసీబీ చెబుతున్నది. సాధారణంగా మ్యాచ్‌లో టాస్ వేసేప్పుడు ఇరుజట్ల సారథులు కరచాలనం చేసుకోవడంతో పాటు టీమ్ షీట్ (ఎవరెవరు ఆడుతున్నారు? అని ఉండే పేపర్)ను ఒకరినొకరు మార్చుకుంటారు. కానీ మొన్నటి మ్యాచ్‌లో మాత్రం పైక్రాఫ్ట్ ఆ పనిచేశాడని పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవీద్ చీమ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు ఫిర్యాదుచేశాడు. మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లు కరచాలనం ఇవ్వకుండా వెళ్లడానికీ కారణం ఆయనేననేది పాక్ వాదన. ఈ మేరకు పీసీబీ స్పందిస్తూ.. ‘పైక్రాఫ్ట్ చేసిన పనిపై నవీద్ ఏసీసీకి ఫిర్యాదుచేశాడు. భారత ఆటగాళ్ల తీరుపైనా అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అందుకే పోస్ట్ మ్యాచ్ సెర్మనీకి మేం మా కెప్టెన్‌ను పంపించలేదు’ అని తెలిపింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ క్రికెట్ నిబంధనలను అనుసరించి పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది.
ఇదిలాఉండగా టీమ్ఇండియా ఆటగాళ్లు తీసుకున్న ఈ నిర్ణయం అప్పటికప్పటిది కాదని.. బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఇలా చేశారని తెలుస్తున్నది. ఆసియా కప్ ఆరంభానికి ముందు నిర్వహించిన కెప్టెన్సీ మీట్‌తో పాటు ఏసీసీ సారథిగా ఉన్న పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీతో సూర్య కరచాలనం చేయడం, దాయాదితో మ్యాచ్‌ను నిషేధించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలోనే బీసీసీఐ ‘నో షేక్‌హ్యాండ్ పాలసీ’ని తీసుకొచ్చినట్టు వినికిడి. గ్రూప్ దశలోనే గాక సూపర్-4 దశలోనూ దాయాదితో ఇదే విధానాన్ని కొనసాగించనున్నారని టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం.
ఈ వివాదంపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ఆటలోఅలాంటి కచ్చితమైన నిబంధనేమీ లేదని పాక్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఒకసారి రూల్స్ బుక్‌ను చూడండి. మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తప్పకుండా హ్యాండ్‌షేక్ ఇవ్వాలని ఏమీ లేదు. అది ఒక మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే’ అని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇలా జరుగడం ఇదేమీ కొత్త కాదు. 2023 వింబుల్డన్ సందర్భంగా ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా.. బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకాతో మ్యాచ్ ముగిశాక ఆమెకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాను రష్యా, బెలారస్ ప్లేయర్లతో కరచాలనం చేయబోనని స్పష్టం చేసింది. క్రీడాస్ఫూర్తిని పాటించలేదని అప్పుడు వింబుల్డన్ ఆమెపై ఎటువంటి చర్యలకూ దిగలేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఒకవేళ భారత్ గనక ఆసియా కప్ గెలిస్తే ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీని అందుకుంటుందా? లేదా? అన్నదానిపై సర్వత్రా చర్చ మొదలైంది. దీనిపై బీసీసీఐ ఎటువంటి విధానాన్ని అవలంభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ వివాదంపై భారత సారథి, హెడ్‌కోచ్ తమ చర్యలను సమర్థించుకున్నారు. మ్యాచ్ ముగిశాక పాక్ జర్నలిస్ట్ ఒకరు ‘దీని వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా?’ అని అడిగిన ప్రశ్నకు సూర్య సమాధానమిస్తూ.. ‘జీవితంలో కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తి కంటే ముందుంటాయి. ఆ విషయాన్ని నేను మ్యాచ్‌కు ముందే చెప్పా. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన బాధితులకు మేం అండగా ఉన్నాం. అలాగే మా విజయాన్ని భారత సైన్యానికి అంకితమిచ్చాం’ అని స్పష్టం చేశాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లోనూ సూర్య ఇదే విషయాన్ని చెప్పాడు. ‘జట్టుగా మేం ఇక్కడికి కేవలం మ్యాచ్ ఆడటానికే వచ్చాం. మేం వారికి (పాకిస్థాన్‌కు) సరైన సమాధానమే ఇచ్చామని భావిస్తున్నాం’ అని తెలిపాడు. ఇదే విషయమై గంభీర్ స్పందిస్తూ.. ‘జట్టుగా మేమంతా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు అండగా ఉండాలని అనుకున్నాం. అంతకుమించి ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన భారత సైనిక బలగాలకు మేం కృతజ్ఞతలు చెబుతున్నాం’ అని చెప్పాడు.