అమ్స్స్టెల్విన్: ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా భారత్..న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న సవిత సారథ్యంలోని టీమ్ఇండియా మెగాటోర్నీలో బోణీ కోసం ఎదురుచూస్తున్నది. పూల్-బిలో రెండు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నది. కివీస్‌పై గెలిచి నేరుగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో మన మహిళల జట్టు కనిపిస్తున్నది.
నాలుగు గ్రూపుల నుంచి టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్స్‌లోకి ప్రవేశించనుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మిగిలిన నాలుగు బెర్తుల కోసం తలపడుతాయి. భారత్ విషయానికొస్తే రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినా.. ఫలితం సానుకూలంగా రాలేదు. దీంతో ఎలాగైనా గెలిచి మెగాటోర్నీలో ముందంజ వేయాలన్న కృత నిశ్చయంతో అమ్మాయిలు ఉన్నారు. స్ట్రైకర్ వందనా కటారియా రెండు గోల్స్‌తో మంచి ఫామ్మీదుండగా, లాల్రెసియామి, షర్మిలాదేవి, నవనీత్‌కౌర్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయారు. మొత్తంగా సమిష్టి ప్రదర్శన కనబరిస్తే..కివీస్‌పై గెలువడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు.