ముంబై : సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/65)తో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (4/81) బంతితో మాయ చేయడంతో మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు 235 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న టెస్టులో జడేజా, సుందర్ ధాటికి కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ (82), విల్ యంగ్ (71) మినహా ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత స్పిన్ ద్వయం క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో పర్యాటక జట్టు రెండు సెషన్లలోనే తోకముడిచింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నా చివరి రెండు ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (31 నాటౌట్), రిషభ్ పంత్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు 4వ ఓవర్లోనే తొలి షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే (4) ఆకాశ్ దీప్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన యంగ్.. సారథి లాథమ్ (28)తో కలిసి రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. సుందర్ 16వ ఓవర్లో లాథమ్‌ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వాషింగ్టన్ అదే ఊపులో రచిన్ (5)నూ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మిచెల్‌తో జతకలిసిన యంగ్.. భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. లంచ్ తర్వాత అర్ధ సెంచరీ పూర్తిచేసుకుని శతకం దిశగా సాగుతున్న యంగ్.. జడేజా 45వ ఓవర్లో స్లిప్స్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో 87 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. జడ్డూ అదే ఓవర్లో బ్లండెల్‌ను డకౌట్ చేసి కివీస్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ (17) కూడా జడ్డూ మాయాజాలానికి బలయ్యాడు. వరుసగా వికెట్లు పడటంతో పాటు కాలునొప్పి వేధిస్తున్నా క్రీజులో నిలిచిన మిచెల్ అర్ధ సెంచరీ తర్వాత సుందర్ బౌలింగ్‌లో బంతిని కట్ చేయబోయి రోహిత్ చేతికి చిక్కాడు.
కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్.. చివరిదాకా ఆధిపత్యం చెలాయించినా ఆఖర్లో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 7వ ఓవర్లోనే సారథి రోహిత్ శర్మ (18) స్లిప్స్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. యశస్వీ జైస్వాల్ (30), గిల్ కుదురుకుని భారత స్కోరు వేగాన్ని పెంచారు. కానీ అజాజ్ పటేల్ వేసిన 18వ ఓవర్లో రివర్స్ స్వీప్ చేయబోయిన జైస్వాల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్ మరుసటి బంతికే డకౌట్ అయ్యాడు. క్రీజులోకి రావడంతోనే ఫోర్ కొట్టిన కోహ్లీ (4) అనవసర పరుగుకు యత్నించి రనౌట్ అయ్యాడు. 17 ఓవర్లకు 78/1గా ఉన్న భారత్.. ఆట ఆఖరి 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86/4గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టులలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జడేజా 312 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 311 వికెట్లతో ఉన్న ఇషాంత్, జహీర్‌ను జడ్డూ అధిగమించాడు. ఈ జాబితాలో కుంబ్లే (619), అశ్విన్ (533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) తర్వాత జడేజా ఉన్నాడు. టాప్-5లో ఉన్న బౌలర్లలో కపిల్ దేవ్ మినహా మిగిలిన నలుగురూ స్పిన్నర్లే కావడం విశేషం. టెస్టులలో 5 వికెట్లు తీయడం జడేజాకు ఇది 14వ సారి.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో 235 ఆలౌట్ (మిచెల్ 82, యంగ్ 71, జడేజా 5/65, సుందర్ 4/81)
భారత్ తొలి ఇన్నింగ్స్: 19 ఓవర్లలో 86/4 (గిల్ 31 నాటౌట్, జైస్వాల్ 30, అజాజ్ 2/33, హెన్రీ 1/15)