Team India | న్యూజిలాండ్‌తో ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వంద పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పూర్తిగా స్పిన్నర్లతో టీం ఇండియా బ్యాటర్లను కట్టడి చేయడానికి ప్రయత్నించింది.
చివరి ఓవర్లో ఆరు బంతులకు ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో టిక్నేర్ నాలుగు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు. రెండు పరుగుల్లో మూడు పరుగులు చేయాల్సిన పరిస్థితి. స్టేడియంలో అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఐదో బంతిని సూర్య కుమార్ యాదవ్ బౌండరీ బాట పట్టించడంతో టీం ఇండియా విజయం సాధించింది. టీం ఇండియా సారధి హార్థిక్ పాండ్యా కూడా ఐదు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్ 1-1 పాయింట్లతో సమం అయింది. మూడో టీ-20 మ్యాచ్ కీలకం కానున్నది.
అంతకుముందు న్యూజిలాండ్ జట్టు పూర్తిగా చతికిల పడింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక అందరూ కలిసి సెంచరీ కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది.లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆరంభం నుంచి ఎదురుదెబ్బలే తగిలాయి.
భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 3.3 ఓవర్ల వద్ద తొలి వికెట్ ఫిన్ అలెన్ ( 11) ను కోల్పోయిన కివీస్.. ఆ వెంటనే డేవన్ కాన్వే (11)ను వికెట్ కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (5), డారిల్ మిచెల్ (8), మార్క్ చాప్మన్ (14), బ్రాస్‌వెల్ (14), సోధీ (1), ఫెర్గూసన్ (0) కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్దే ఆగిపోయారు.