Football | హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాదిని కనీసం ఒక్క విజయం లేకుండానే నిరాశగా ముగించింది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా సోమవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో మలేషియాతో జరిగిన పోరును టీమ్ఇండియా 1-1తో డ్రాగా ముగిసింది. ఆద్యంతం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో మలేషియా తరఫున పౌలో జోశ్(19ని) గోల్ చేయగా, రాహుల్ బెకు(39ని) భారత్‌కు గోల్ అందించాడు.
మ్యాచ్ నిర్ణీత సమయం(90ని)తో పాటు అదనపు సమయంలోనూ ఇరు జట్లు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించాయి. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో చెలరేగేందుకు టీమ్ఇండియా ప్రయత్నిస్తే.. నిలువరించేందుకు మలేషియా దీటుగా పోరాడింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే బ్లూటైగర్స్ దూకుడు కనబరిచారు. చెరో గోల్‌తో స్కోర్లు సమమయ్యాయి. అయితే మరో గోల్ కోసం రెండు జట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది.