రాజ్‌గిర్(బీహార్): ఆసియా కప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొరియాను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆసియా కప్ గెలువడం ద్వారా వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీకి భారత్ నేరుగా అర్హత సాధించింది. 2017 తర్వాత తొలిసారి ఆసియా కప్ గెలిచిన భారత్ నాలుగోసారి టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. గతంలో 2003(కౌలాలంపూర్), 2007(చెన్నై) టోర్నీల్లోనూ భారత్ విజయ పతాక ఎగురవేసింది. మ్యాచ్ విషయానికొస్తే ఐదుసార్లు చాంపియన్ కొరియాపై ఆది నుంచే టీమ్ఇండియా తమదైన ఆధిపత్యం ప్రదర్శించింది. దిల్‌ప్రీత్‌సింగ్(28ని, 45ని) డబుల్ గోల్స్‌తో అలరించగా, సుఖ్జీత్సింగ్(1ని), అమిత్ రోహిదాస్(50ని) ఒక్కో గోల్ చేశారు. డియాన్ సన్(51ని)..కొరియాకు గోల్ అందించాడు.
కొరియాతో ఆఖరి పోరులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ మొదలైన 29 సెకన్లకే సుఖ్జీత్సింగ్ ఫీల్డ్ గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కొరియా డిఫెన్స్‌ను ఏమారుస్తూ భారత స్ట్రైకర్లు విరామం ఎరుగకుండా దాడులు చేయడం కలిసి వచ్చింది. ఎక్కువ శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు భారత్ ప్రయత్నించడం కలిసి వచ్చింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసే భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో క్వార్టర్లో ఏ మాత్రం జోరు తగ్గని భారత్ పెనాల్టీ కార్నర్లు లక్ష్యంగా ముందుకు సాగింది. ఈ దశలో 28వ నిమిషంలో దిల్‌ప్రీత్ ఫీల్డ్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఈ దశలో కొరియా ప్రతిదాడులకు ప్రయత్నించినా భారత్ దీటుగా తిప్పికొట్టింది.
మిడ్ఫీల్డ్తో పాటు డిఫెండర్లు కొరియా ఎటాకింగ్‌ను సమర్థంగా నిలువరించారు. రెండో క్వార్టర్ అయిపోతుందన్న తరుణంలో వచ్చిన పెనాల్టీని దిల్‌ప్రీత్ గోల్‌గా మలువడంతో ఆధిక్యం 3-0కు చేరుకుంది. అయితే నిమిషం తేడాతో స్ట్రైకర్ డియాన్ సన్ గోల్ కొట్టడంతో కొరియా ఖాతా తెరిచింది. ఆఖరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ ఎక్కడా వెనుకకు తగ్గలేదు. ఓవైపు కొరియా డిఫెన్స్‌ను కకావికలు చేస్తూ వరుస దాడులు చేస్తూనే ప్రతిదాడులను అడ్డుకుంది. ఈ క్రమంలో 50వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను రోహిదాస్ గోల్ చేయడంతో భారత్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. కొరియా గోల్కీపర్ను కంగుతినిపిస్తూ రోహిదాస్ కొట్టిన బంతి బుల్లెట్‌లాగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకుపోయింది. ఇటీవలి టోర్నీల్లో విఫలమైన భారత హాకీ జట్టు అంచనాలకు మించి రాణించింది.