రాజ్‌కోట్: గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జరుగనుంది. గత రెండు సిరీస్‌లను దక్కించుకుని జోరు మీదున్న టీమ్ఇండియా.. ఐర్లాండ్నూ చిత్తు చేసి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భారత్‌లో జరగాల్సి ఉన్న మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో జట్టులో చోటు ఆశిస్తున్న యువ క్రికెటర్లకు, తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు సీనియర్లకు ఈ సిరీస్ సదావకాశం. భారత్‌తో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్న ఐర్లాండ్.. ఆతిథ్య జట్టుకు పోటీనిచ్చేందుకు సిద్ధమైంది.
ఈ సిరీస్‌లో రెగ్యులర్ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆమె మంచి ఫామ్‌లో ఉంది. వరుసగా ఐదు అర్ధ శతకాలు సాధించిన ఆమె జోరు కొనసాగించాలని చూస్తోంది. షఫాలీ వర్మకు ఈ సిరీస్‌లోనూ చోటు దక్కని నేపథ్యంలో ప్రతీకతో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను ఆరంభించనుంది. టాపార్డర్‌లో హర్మన్‌ప్రీత్ లేకపోవడంతో మంధాన, ప్రతీకతో పాటు వెస్టిండీస్ సిరీస్‌లో తొలి శతకం సాధించిన హర్లీన్ డియోల్‌పై మరింత భారం పడనుంది. జెమీమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ బ్యాటర్ రీచా ఘోష్ కూడా తలా ఓ చేయి వేస్తే ఐర్లాండ్ బౌలర్లకు తిప్పలు తప్పవు.
హర్మన్‌ప్రీత్‌తో పాటు సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కూ విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో పేస్ బాధ్యతలను యువ పేసర్లు టిటాస్ సాధు, సయిమా ఠాకూర్ మోయనున్నారు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో 13 వికెట్లు పడగొట్టిన సాధు.. తన స్వింగ్, పేస్‌తో మరోసారి సత్తా చాటాలని భారత్ ఆశిస్తోంది. ఇప్పటిదాకా 8 వన్డేలాడి 7 వికెట్లు పడగొట్టిన సయిమా కూడా జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఈ సిరీస్ చక్కని అవకాశం. వైస్ కెప్టెన్‌తో పాటు స్పిన్ బాధ్యతలను మోయనున్న దీప్తి శర్మకు ప్రియా మిశ్రా, తనూజా ఏ మేరకు అండగా నిలుస్తారనేది చూడాలి.
భారత్‌తో ఇంత వరకు జరిగిన 12 వన్డేలలో ఒక్కదాంట్లోనూ గెలవని ఐర్లాండ్.. ఈ సిరీస్‌లో అయినా మంధాన సేనకు గట్టి పోటీనివ్వాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ గాబీ లూయిస్, ఆల్‌రౌండర్ ఒర్లా ప్రెండర్గస్ట్, లీ పాల్, అర్లెనె కెల్లీ ఆ జట్టులో కీలకం. స్వదేశంలో పటిష్టంగా ఉండే భారత్‌ను ఐర్లాండ్ ఏ మేరకు ఎదుర్కుంటుందనేది ఆసక్తికరం.