IND Vs END | కోల్‌కతా: పొట్టి పోరుకు వేళయైంది. ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సమరానికి బుధవారం తెరలేవనుంది. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేదు అనుభవాలను మరిపించేందుకు టీమ్ఇండియాకు ఈ సిరీస్ దోహదం చేయనుంది. దీనికి తోడు ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు కూర్పుపై ఒక అంచనాకు వచ్చేందుకు ఇరు జట్లకు ఇది ఉపయోగపడనుంది. బలబలాల పరంగా సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఐదు మ్యాచ్‌ల టీ20 పోరులో బోణీ ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.
చారిత్ర ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లో గెలువడం ద్వారా సిరీస్‌లో ముందంజ వేయాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. సొంతగడ్డపై సత్తాచాటేందుకు ఓవైపు కుర్రాళ్లతో కళకళలాడుతున్న టీమ్ఇండియా కనిపిస్తుంటే..మరోవైపు ఇంగ్లండ్ దుర్బేద్యమైన బ్యాటింగ్ బలగంతో సై అంటున్నది.
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద ఖాయం అనిపిస్తున్నది. ఇదిలా ఉంటే గాయం నుంచి తేరుకున్న సీనియర్ పేసర్ షమీపై అందరి కండ్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశం కానుంది. సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమ్ఇండియా తుది జట్టులో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశముంది. ఆల్‌రౌండర్ల కోటాలో సుందర్, నితీశ్ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కనుంది. మ్యాచ్‌కు ముందే ఇప్పటికి ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా, యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ విధ్యంసం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.