ఓవర్‌నైట్ ఆటగాళ్లు రెండు పరుగులే జోడించి ఔట్ కాగానే.. మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించేలా కనిపిస్తే.. జడేజా, పంత్ పోరాటంతో టీమ్ ఇండియా తిరిగి పోటీలోకి వచ్చింది! ఇక భారీ స్కోరు చేయడం ఖాయమే అని సంబుర పడుతుంటే.. పాతకాపు అండర్సన్ తన ఇన్స్వింగర్లతో భారత్‌ను ఆలౌట్ చేసి ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపాడు! హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టగానే.. టీమ్ఇండియాకు ఇక తిరుగులేదనుకుంటే.. బర్న్స్, రూట్ పోరాటంతో ఇంగ్లండ్ సమఉజ్జీగా నిలిచింది! భారత్, ఇంగ్లండ్ మధ్య ఇలా ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న రెండో టెస్టు రసపట్టుకు చేరింది.
లండన్: తొలి టెస్టులో విజయానికి చేరువై.. వర్షం కారణంగా నిరాశ చెందిన టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లో జోరు కనబరుస్తున్నది. బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లకు బౌలర్ల కృషి తోడవడంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న పోరులో కోహ్లీసేన.. ఇంగ్లండ్‌కు గట్టి పోటీనిస్తున్నది. ఓవర్‌నైట్ సెంచరీ వీరుడు లోకేశ్ రాహుల్ (129), రహానే (1) ఆదిలోనే ఔటైనా.. పంత్ (37), జడేజా(40) ఆకట్టుకోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 119 పరుగులు చేసింది. జో రూట్ (49 బ్యాటింగ్), రోరీ బర్న్స్ (49) రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. టీమ్ఇండియా స్కోరుకు ఇంకా 245 పరుగులు వెనుకబడి ఉంది. రూట్‌తో పాటు బెయిర్‌స్టో (6) క్రీజులో ఉన్నాడు.
రెండు బంతుల్లో.. రెండు వికెట్లు
రెండో సెషన్లో సాఫీగా సాగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు టీ తర్వాత సిరాజ్ ఝలక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో డామ్ సిబ్లే (11), హసీబ్ హమీద్ (0)లను పెవిలియన్ బాట పట్టించాడు. లెంగ్త్ బాల్‌కు సిబ్లేను బలిగొన్న సిరాజ్.. మరుసటి బంతికే హసీబ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు పడటంతో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత మరోసారి కెప్టెన్ జో రూట్‌పై పడింది. బర్న్స్‌తో కలిసి అతడు ఆచితూచి ఆడాడు. ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్న ఈ జంట క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పింది. కోహ్లీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోగా.. మూడో వికెట్‌కు 85 పరుగులు జత చేశాక ఎట్టకేలకు షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. బెయిర్‌స్టోతో కలిసి రూట్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83, రాహుల్ (సి) సిబ్లే (బి) రాబిన్సన్ 129, పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9, కోహ్లీ (సి) రూట్ (బి) రాబిన్సన్ 42, రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1, పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37, జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40, షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0, ఇషాంత్ (ఎల్బీ) అండర్సన్ 8, బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0, సిరాజ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 364, వికెట్ల పతనం: 1-126, 2-150, 3-267, 4-278, 5-282, 6-331, 7-336, 8-362, 9-364, 10-364, బౌలింగ్: అండర్సన్ 29-7-62-5, రాబిన్సన్ 33-10-73-2, కరన్ 22-2-72-0, వుడ్ 24.1-2-91-2, అలీ 18-1-53-1.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) షమీ 49, సిబ్లే (సి) రాహుల్ (బి) సిరాజ్ 11, హసీబ్ (బి) సిరాజ్ 0, రూట్ (నాటౌట్) 49, బెయిర్‌స్టో (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 119/3, వికెట్ల పతనం: 1-23, 2-23, 3-108, బౌలింగ్: ఇషాంత్ 11-2-32-0, బుమ్రా 9-3-23-0, షమీ 8-1-23-1, సిరాజ్ 13-4-34-2, జడేజా 4-1-6-0.