లార్డ్స్: ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌తో పాటు బుధవారం మొదలైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్ గెలుపుపై గురిపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన ఉమెన్ ఇన్ బ్లూ.. లార్డ్స్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ఇండియా.. శ్రీలంక, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల విజయం తర్వాత వరుసగా మూడో వన్డే సిరీస్‌ను ఖాతాలో వేసుకునే అవకాశముంది. బ్యాటింగ్ విషయంలో భారత్ దుర్బేధ్యంగా కనబడుతున్నది. ఓపెనర్లు స్మృతి మందన, ప్రతీక రావల్, మూడో స్థానంలో వస్తున్న హర్లీన్ డియోల్ మంచి టచ్‌లో ఉన్నారు. ప్రతీక రాణించడంతో షెఫాలీ వర్మ వంటి బ్యాటర్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వస్తున్నది.
మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గత వన్డేలో కాస్త తడబడ్డా.. జెమీమా, దీప్తి శర్మ మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. రిచా ఘోష్ ఫినిషర్ పాత్రను పోషిస్తున్నది. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్ పేసర్లు రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రకార్ లేని లోటును యువ పేసర్లు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ భర్తీ చేస్తున్నారు. తొలి వన్డేతో అరంగేట్రం చేసిన క్రాంతి.. వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ప్రపంచకప్ నాటికి వీరిని మరింత సానబెడితే భారత బౌలింగ్ బెంచ్ కూడా బలంగా మారనుంది. ఇక స్పిన్ విభాగంలో దీప్తి శర్మ, స్నేహ్ రాణాకు తోడుగా తెలుగమ్మాయి శ్రీచరణి అంచనాలకు మించి రాణిస్తున్నది. అన్ని విభాగాల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుంటే సొంతగడ్డపై ఇంగ్లండ్ తడబడుతున్నది. మొదటి వన్డేలో విఫలమైన ఆ జట్టు.. రెండో వన్డేలో అయినా పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నది.
దుబాయ్: భారత ఓపెనర్ ప్రతీకకు ఐసీసీ షాకిచ్చింది. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి వన్డేలో ప్రతీక.. ఇంగ్లండ్ బౌలర్లు లారెన్ ఫైలర్, సోఫీ ఎకిల్స్టొన్తో దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఐసీసీ.. ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధించింది. ఇక మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదుచేసినందుకు గాను ఇంగ్లండ్‌కూ జరిమానా పడింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత పడింది.