బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు వేదికైన బ్రిస్బేన్‌పై వరుణ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం మొదలైన టెస్టు తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కల్గించాడు. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మబ్బులు కమ్ముకున్న వాతావరణాన్ని అంచనా వేస్తూ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తేమతో కూడిన పిచ్‌పై టీమ్ఇండియా బౌలర్లను ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ(19 నాటౌట్), నాథన్ మెక్‌స్వీని(4 నాటౌట్) చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా స్పెల్‌ను జాగ్రత్తగా ఆడారు. ఏ మాత్రం తొందరపాటు కనబర్చకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు.
తొలి సెషన్లో ఒకింత తెరిపినివ్వడంతో 25 నిమిషాల వ్యవధిలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా వాన రావడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన ఖవాజ, మెక్‌స్వీని..సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలు కొట్టారు. టెస్టులో మిగిలిన నాలుగు రోజులకు కూడా వర్షం అంతరాయం కల్గించనుందన్న వార్తల నేపథ్యంలో మూడో టెస్టుపై ఆసక్తి నెలకొన్నది. ఇదిలా ఉంటే సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ఆసీస్ అభిమానులు వెక్కిరించడంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.