IND vs AUS | విదేశీ క్రికెట్ జట్లు భారత పర్యటనకు వచ్చినా.. టీమ్ఇండియా ఇతర దేశాలకు వెళ్లినా క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు, అభిమానులు, ఆటగాళ్ల చర్చ అంతా ‘పిచ్’ల గురించే.. ఆతిథ్య దేశాలు తమకు అనుకూలంగా పిచ్‌లను రూపొందించుకుంటూ పర్యాటక జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో ఎవరి నిర్ణయాన్ని వాళ్లే సమర్థించుకోవడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైంది. మరి ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ సమరానికి సిద్ధమవుతోన్న రోహిత్ సేనకు కంగారూల అడ్డాలో ఎలాంటి పిచ్‌లు దర్శనమివ్వనున్నాయి? గత రెండు పర్యటనలలో భారత్ చేతిలో చతికిలపడి సిరీస్‌లను కోల్పోయిన అవమానభారంతో ఉన్న ఆసీస్.. ఈసారి పూర్తిస్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న తరుణంలో వేదికలు ఎలా స్పందించనున్నాయి? అనేది ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)కి మరో 4 రోజుల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1991-92 తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడనుండటం ఇదే ప్రథమం. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మైదానాలైన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలుగా ఈ టెస్టులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి? బ్యాటింగ్, బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లుగా పేరున్న ఆసీస్ పిచ్‌లు కంగారూలకు ఏకపక్షంగా సహకరిస్తాయా? పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న ఆసీస్ పేసర్ల ధాటికి భారత్‌కు కష్టాలు తప్పవా? గత రెండు సీజన్లలో ఈ వేదికలపై భారత ప్రదర్శన ఎలా ఉంది?
ఒకప్పుడు గబ్బా (బ్రిస్బేన్)లో మ్యాచ్ అంటేనే ఆస్ట్రేలియా ఊగిపోయేది. కానీ 2032 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న బ్రిస్బేన్.. ఈ స్టేడియాన్ని పూర్తి అథ్లెటిక్ స్టేడియంగా మార్చాలని భావిస్తున్నది. భారత్‌తో మ్యాచ్ తర్వాత మరో రెండు, మూడు టెస్టుల కంటే ఇక్కడ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు తక్కువే. ఈ వేదికతో భారత్‌కు మధుర జ్ఞాపకాలున్నాయి. గత పర్యటనలో సిరీస్ 1-1తో సమం కాగా ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టులో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో అపూర్వ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ నిర్దేశించిన 329 పరుగుల ఛేదనను భారత్ 7 వికెట్లు కోల్పోయి విజయవంతంగా పూర్తిచేయడమే గాక సిరీస్‌నూ వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. గిల్ (91), పంత్ (89) భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ పిచ్ పేసర్లకు అనుకూలం. 2022-23లో సౌతాఫ్రికాతో ఇక్కడ జరిగిన టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పిచ్‌పై ఉండే గడ్డి పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. 2018 నుంచి ప్రస్తుత ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఇక్కడ 6 టెస్టులాడి ఏకంగా 36 వికెట్లు దక్కించుకున్నాడు.
భారత్ గత రెండు పర్యటనలలో మెల్బోర్న్లో ఆడిన రెండు టెస్టులనూ గెలుచుకుంది. 2018లో విరాట్ కోహ్లీ, గత సీజన్లో అజింక్యా రహానే ఇక్కడ శతకాలు బాదారు. గిల్, సిరాజ్ టెస్టు అరంగేట్రాలు చేసింది ఇక్కడే. పేసర్లకు అనుకూలించినా ఆరంభంలో కాస్త కుదురుకుంటే బ్యాటర్లు ఇక్కడ పరుగులు రాబట్టొచ్చు. గత ఆరు సీజన్లలో ఆసీస్ ఇక్కడ 6 టెస్టులు ఆడితే అందులో 4 గెలిచి రెండింటిలో (ఆ రెండూ భారత్ చేతిలోనే) ఓడింది. ఇటీవల ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లోనూ బంతిదే ఆధిపత్యం. మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు ఇక్కడ విజయావకాశాలు ఎక్కువ.
ఆస్ట్రేలియాలోని అత్యంత పురాతన స్టేడియాల్లో ఒకటైన ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టుకు ఆతిథ్యమివ్వనుంది. పేస్‌తో పాటు స్పిన్‌కూ సహకరించే ఎస్సీజీలో భారత్ ఆడిన గత రెండు మ్యాచ్‌లనూ డ్రా చేసుకుంది. జనవరిలో ఇక్కడ జరుగబోయే ఐదో టెస్టులో వాతావరణ ప్రభావం పర్యాటక జట్టుపై అధికంగా ఉండనుంది. 2018లో భారత విజయానికి అడ్డుపడ్డ వరుణుడు.. 2022-23లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌నూ సాగనివ్వలేదు. 2018 నుంచి ఇక్కడ ఆడిన 6 టెస్టులలో ఆస్ట్రేలియా 2 గెలిచి నాలుగింటిని డ్రా చేసుకుంది. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబూషేన్‌కు ఇక్కడ (ఆరు టెస్టులలో 81.55 సగటుతో 734 రన్స్) ఘనమైన రికార్డు ఉంది.
బీజీటీలో తొలి టెస్టుకు పెర్త్ (ఆప్టస్ స్టేడియం) ఆతిథ్యమివ్వబోతోంది. వాస్తవానికి తమ దేశ పర్యటనకు వచ్చే జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. బ్రిస్బేన్ టెస్టుతో ఆహ్వానం పలుకుతుంది. కానీ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి దానిని పెర్త్‌కు మార్చారు. 2018-19లో స్టేడియాన్ని పునరుద్ధరించాక ఆస్ట్రేలియా.. ఇక్కడ భారత్‌తో తొలి మ్యాచ్ ఆడింది. ఆ టెస్టులో కంగారులు 146 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ శతకంతో టెస్టులలో తన 25వ సెంచరీని ఇక్కడే పూర్తిచేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. 2018 నుంచి ఆస్ట్రేలియా ఇక్కడ ఆడిన 4 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడలేదు.
మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారీ స్కోరు సాధించి తర్వాత ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి మ్యాచ్‌లో పైచేయి సాధించడం ఇక్కడ ఆస్ట్రేలియన్లకు వెన్నతో పెట్టిన విద్య. తొలి మూడు రోజులు బ్యాటర్లతో పాటు పేసర్లకూ సమానంగా సహకరించే ఈ పిచ్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకునేసరికి స్పిన్‌కు నుకూలంగా మారే అవకాశాలున్నాయి. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియన్ గత 4 మ్యాచ్‌లలో ఇక్కడ ఏకంగా 27 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో టెస్టుకు పూర్తి పేస్ పిచ్‌నే తయారుచేస్తున్నట్టు పిచ్ క్యూరేటర్లు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తొలి టెస్టు నుంచే పేస్ రుచి చూపేందుకు ఆసీస్ ప్రణాళికలు రచిస్తోంది.
అడిలైడ్ ఓవల్ అంటేనే సగటు భారత క్రికెట్ అభిమాని వెన్నులో వణుకు. 2020-21 పర్యటనలో ఇక్కడ ఆడిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాభవాన్ని కళ్లజూసింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యల్పం. ఈ భయానికి తోడు ఈసారి ఇక్కడ జరిగేది డే అండ్ నైట్ (పింక్ బాల్) టెస్టు. ఈ గ్రౌండ్లో ఆసీస్ ఆడిన ఒక్క డే అండ్ నైట్ టెస్టూ ఓడిపోలేదు. 2018 నుంచి ఇక్కడ ఆడిన 6 టెస్టులలో ఆసీస్ 5 గెలిచి ఒకదాంట్లో ఓడింది. 2018 టూర్లో భారత్ గెలిచింది. టాస్, రాత్రివేళ పరిస్థితులు ఇక్కడ కీలకంగా మారే అవకాశముంది. సంప్రదాయకంగా అడిలైడ్ పేసర్లకు స్వర్గధామం. 2018 నుంచి ఇక్కడ ఆడిన టెస్టులలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 30 వికెట్లు తీశాడు.