కరార(గోల్డ్‌కోస్ట్): భారత్, ఆస్ట్రేలియా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన నేపథ్యంలో సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లు తప్పకగెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గురువారం రెండు జట్ల మధ్య నాలుగో టీ20 పోరు జరుగునుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న వేళ ప్రతీ సిరీస్ కీలకమైన క్రమంలో రెండు జట్లు తమ విన్నింగ్ కాంబినేషన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. డాషింగ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ మంచి ఫామ్మీదుండటం జట్టుకు కలిసి రానుండగా, గిల్ నిలకడలేమి జట్టును ఆందోళనకు గురి చేస్తున్నది.
భవిష్యత్ ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా భావిస్తున్న గిల్ టీ20ల్లో అంతగా రాణించలేకపోతున్నాడు. జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 37, 5, 15 స్కోర్లతో నిరాశపరిచాడు. గిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న టీమ్ మేనేజ్మెంట్ అందుకు తగ్గట్లు అవకాశాలు ఇస్తూపోతున్నది. మూడో టీ20లో వాషింగ్టన్ సుందర్‌తో పాటు లోయార్డర్‌లో జితేశ్శర్మ రాణించడం టీమ్ఇండియాకు కలిసొచ్చింది. ఇన్ని రోజులు ఫామ్‌లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాడిలో పడటం జట్టుకు ఊరటనిచ్చే అంశం. మరోవైపు యాషెస్ సిరీస్ కోసం ట్రావిస్ హెడ్, జోష్ హజిల్‌వుడ్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా, కెప్టెన్ మిచెల్ మార్ష్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్ జట్టును ముందుకు నడిపించనున్నారు.