Mohammed Shami | అందరూ ఊహించిన విధంగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ప్రకటించిన టీమిండియా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ శనివారం ఇంగ్లాండ్ పర్యటన కోసం 18 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టులు ఆడుతుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ కొత్త సైకిల్ ఇదే సిరీస్‌తో మొదలవనున్నది.
అర్ష్‌దీప్‌కు తొలిసారిగా టెస్ట్ జట్టులో చేరగా.. మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. షమీ చివరిసారిగా దాదాపు రెండేళ్లుగా టెస్టులు ఆడడం లేదు. చివరిసారిగా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగాడు. గాయం కారణంగా 14 నెలలు దూరమయ్యాడు. ఆ తర్వాత షమీ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పేలవమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. తొమ్మిది మ్యాచులు ఆడిన షమీ.. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవయ్యాయి. ప్రస్తుతం టెస్టుల్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయగలడా? అన్నది సందేహాస్పదంగా మారింది.
జట్టులో చోటు దక్కకపోవడానికి ఇదే కారణమని తెలుస్తున్నది. మరో వైపు అర్ష్‌దీప్ సింగ్ టీ20ల్లో బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్‌లో స్వింగ్‌ను సద్వినియోగం చేసుకొని రాణించే అవకాశాలున్నాయి. అర్ష్‌దీప్ సింగ్ 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడాడు. 30.37 సగటుతో 66 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో అర్ష్‌దీప్ 11 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ ఇంగ్లాండ్‌లో కెంట్ తరఫున ఆడిన అనుభవం ఉంది. అయితే, మహ్మద్ షమీకి ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయకపోవడం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ సైతం ఫిట్‌గా లేడని, అందుకే అతన్ని ఎంపిక చేయలేదని తెలిపాడు.