కౌలాలంపూర్ : ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో గురువారం శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా.. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో మాదిరిగానే బౌలర్లు చెలరేగడంతో లంక బ్యాటర్లు బెంబేలెత్తారు. భారత్ నిర్దేశించిన 119 పరుగుల ఛేదనలో లంక అమ్మాయిలు నిర్ణీత ఓవర్లలో 58/9 పరుగులకే పరిమితమయ్యారు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ (వెస్టిండీస్, మలేషియా, శ్రీలంక).. ప్రత్యర్థిని కనీసం 60 పరుగుల మార్కును కూడా దాటనీయకపోవడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ను లంక బౌలర్లు కట్టడి చేయడంతో భారత్.. 20 ఓవర్లలో 118/9 పరుగులు చేసింది. యువ ఓపెనర్, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (44 బంతుల్లో 49, 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాటర్లు చతికిలపడ్డారు. సహచర బ్యాటర్లు వెనుదిరుగుతున్నా లంక బౌలర్లను త్రిష సమర్థంగా ఎదుర్కొని విలువైన పరుగులు రాబట్టింది. మిథిలా (16), జోషిత (14), కెప్టెన్ నికీ ప్రసాద్ (11) రెండంకెల స్కోరును దాటారు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు కూడా చెలరేగడంతో లంక విలవిల్లాడింది. ఆ జట్టులో రష్మిక సెవ్వండి (15) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పరుణిక (2/7), షబ్నమ్ (2/9), జోషిత (2/17), వైష్ణవి (1/3) మెరవడంతో లంక పూర్తి ఓవర్లు ఆడినా లక్ష్యం దిశగా సాగలేదు.
లీగ్ దశలో ఆడిన మూడింటికీ మూడూ గెలిచిన టీమ్ఇండియా.. గ్రూప్-ఏలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూప ర్ సిక్స్‌లో భారత్.. ఈనెల 26న బంగ్లా తో,28నస్కాట్లాండ్తో తలపడుతుంది.